Tue Nov 05 2024 14:04:52 GMT+0000 (Coordinated Universal Time)
లిక్కర్ "కిక్కు"తో వీధిన పడాల్సిందేనా?
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ చిక్కుకుంది. వరసగా నేతలు అరెస్ట్ అవుతుండటం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది
అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అది. అన్నా హజారే దీవెనలతో ఆవిర్భవించిన జెండా అది. మామూలు విషయం కాదు. ఐఆర్ఎస్ అధికారిగా ఉండి అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీని ప్రజలు ఆదరిస్తారో? లేదో? అన్న అనుమానం తొలినాళ్లలో అందరికీ కలిగింది. పైగా దేశ రాజధానిలో నెలకొల్పిన పార్టీ కావడంతో అక్కడ అన్ని రకాల సంస్కృతులు, సంప్రదాయాలు, భాషలతో కూడిన ప్రజలుంటారు. జనం ఏ మేరకు ఆశీర్వదిస్తారో తెలియదు. కానీ అరవింద్ కేజ్రీవాల్ ఇదేమీ ఆలోచించలేదు. తన ముందున్న లక్ష్యం ఒక్కటే. ఢిల్లీ అధికార పీఠాన్ని దక్కించుకోవడమే. అందుకోసమే ఆయన ప్రభుత్వ అధికారి పదవికి రాజీనామా చేసి మరీ రాజకీయాల్లోకి కాలు మోపారు.
హ్యాట్రిక్ విక్టరీతో...
ఎందరో ఇలా రాజకీయాల్లో వచ్చినా ఎవరూ సక్సెస్ కాలేదు. అదే అభిప్రాయం అరవింద్ కేజ్రీవాల్ విషయంలో అంతే అనుకున్నారు. అంచనాలు అసలు లేనే లేవు. సామాజిక కార్యకర్తగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ 2012 నవంబరు 26వ తేదీన ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు. సామాన్యుడి పార్టీ జనంలోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. లక్ అనుకోవాలేమో గుర్తు కూడా చీపురు రావడంతో సామాన్యులు మరింత పార్టీకి చేరువయ్యారు. పార్టీ స్థాపించింది 2012లో అయితే ఏడాదిలోనే అంటే 2013లో జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించింది. అయితే పూర్తి మెజారిటీ రాలేదు. 70 స్థానాలకు కేవలం 28 స్థానాలు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ మద్దతుతో అధికారంలోకి తొలిసారిగా కేజ్రీవాల్ వచ్చారు.
క్లీన్ స్వీప్ చేసి.. పంజాబ్ లోనూ...
అయితే ఆ పొత్తు ఎంతో కాలం నిలవలేదు. తిరిగి 2015లో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. ఈసారి క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 70 స్థానాలకు గాను 67 స్థానాలు దక్కించుకుని తమకు పోటీలో ఎవరూ లేరని చెప్పకనే చెప్పింది. 2020లో జరిగిన ఎన్నికల్లోనూ ఆప్ ఘన విజయం సాధించింది. మూడోసారి ముచ్చటగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఇక అంతటితో ఆగలేదు. 2022లో జరిగిన పంజాబ్ ఎన్నికల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించి జాతీయ పార్టీలను పక్కకు నెట్టింది. 112 స్థానాల్లో 92 సీట్లు సాధించి జెండా ఎగురవేసింది. ఆమ్ ఆద్మీపార్టీ జాతీయ పార్టీగా అవతరించింది. ఇదంతా కేవలం అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన పార్టీ కావడంతోనే ప్రజలు దానిని ఆదరించారు.
లిక్కర్ స్కామ్ తో...
అయితే దానిపై ఇప్పుడు అవినీతి ముద్ర పడింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో వరసగా నేతలు అరెస్ట్ అవుతుండటం పార్టీ నేతలకు కూడా మింగుడుపడటం లేదు. సామాన్యుడి పార్టీగా ఉన్న ఆప్ కు లిక్కర్ కిక్కుతో వీధిన పడాల్సి వచ్చింది. ఆ పార్టీ కీలక నేతలు మనీష్ సిసోడియా, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ అరెస్ట్ అయ్యారు. ఊచలు లెక్కబెడుతున్నారు. మనీ లాండరింగ్ కు కూడా పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇది పార్టీకి ఇబ్బంది కరమైన పరిణామంగానే చూడాలి. ఇన్నాళ్లూ అవినీతి ముద్ర పడని పార్టీకి ఇప్పుడు పడిన లిక్కర్ మచ్చ భవిష్యత్ లో ఏ మేరకు గెలుపోటములపై పనిచేస్తుందన్నది చూడాలి.
Next Story