Sat Nov 23 2024 21:41:23 GMT+0000 (Coordinated Universal Time)
BRS : బీఆర్ఎస్ ఆఫీసు మూసివేసినట్లేనా? ఉన్నోళ్లు కూడా జంపేనట
తెలంగాణలో భారత రాష్ట్ర సమితి ఓటమి పాలయిన తర్వాత రాజకీయ పరిణామాలు మారుతున్నాయి
తెలంగాణలో భారత రాష్ట్ర సమితి ఓటమి పాలయిన తర్వాత రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. బీఆర్ఎస్ ఓటమితో జాతీయ స్థాయిలో కూడా పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా అక్కడ బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా పక్క చూపులు చూస్తున్నారు. తెలంగాణ ఎన్నికలు జరగక ముందు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించాలని ప్రయత్నించారు. ప్రధానంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో పార్టీ శాఖలను ఏర్పాటు చేశారు.
యాక్టివిటీ పూర్తిగా...
అయితే ఒడిశాలో బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే పార్టీని వీడి వెళ్లిపోయారు. మహారాష్ట్ర లో కూడా పార్టీ పరిస్థిితి అయోమయంలోనే ఉంది. ఇక పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ యాక్టివిటీ పూర్తిగా కనుమరుగైంది. తెలంగాణ ఎన్నికలకు ముందు ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను కేసీఆర్ నియమించారు. మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు మెడలో కూడా పార్టీ కండువా వేశారు. విజయవాడలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆర్భాటంగా ప్రారంభించారు.
తోట జనసేనలోకి...?
కానీ తెలంగాణలో ఓటమి పాలు కావడంతో అక్కడ కూడా నేతలు పక్క చూపులు చూస్తున్నారని తెలిసింది. బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఆయన 2019 ఎన్నికల్లో జనసేన తరుపున గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అంతకు ముందు ప్రజారాజ్యం పార్టీ తరుపున గుంటూరు పార్లమెంటుకు పోటీ చేసిన తోట చంద్రశేఖర్ విద్యావంతుడు, ఆర్థికంగా బలవంతుడు, సామాజివర్గం పరంగా బలమైన నేత కావడంతో ఆయనను పార్టీలు స్వాగతించే అవకాశముంది.
రావెల వైసీపీలోకి?
అలాగే మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు టీడీపీ నుంచి బీజేపీ తర్వాత జనసేనలోకి వెళ్లి ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. ఆయన వైసీపీ వైపు చూస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఏపీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎలాంటి యాక్టివిటీ లేదు. నేతలు కూడా కార్యాలయానికి రాకపోతుండటంతో పార్టీ కార్యాలయాన్ని మూసివేస్తారన్న ప్రచారం జరుగుతుంది. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేసే అవకాశాలు కూడా కనిపించడం లేదు. ఎల్లుండి రావెల వైసీపీలో చేరతారన్న ప్రచారం జరుగుతుంది. మరి బీఆర్ఎస్ కార్యాలయానికి ఏపీలో తాళం పడినట్లే.
Next Story