Mon Dec 23 2024 06:57:38 GMT+0000 (Coordinated Universal Time)
Seethakka : మావోయిస్టు నుంచి మంత్రి వరకూ.. ఎవరూ సాధించలేరుగా అక్కా
అనసూయ అలియాస్ సీతక్క నేడు తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
అనసూయ అలియాస్ సీతక్క నేడు తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సాధారణ మహిళ లేదా రాజకీయ వారసత్వం అందుకున్న మహిళ అయితే అందులో ప్రత్యేకత ఏమీ లేదు. కానీ మావోయిస్టుగా ఉండి తర్వాత జనజీవన స్రవంతిలో కలిసి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తర్వాత మంత్రి కావడం అంటే ఆషామాషీ కాదు. అందులోనూ ఒక మహిళ అన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొని, కేసులను తలపడి.. చివరకు రాజ్యాంగాన్ని రచించే టీంలో భాగస్వామ్యులవుతున్నారంటే ఒక్క సీతక్కకే సాధ్యం. ప్రజల్లో ఉంటూ.. నిత్యం వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడే వాళ్లకు ఎక్కడా అపజయం ఉండదు అనడానికి సీతక్క జీవితమే ఉదాహరణ.
ఆదివాసీల హక్కుల కోసం...
సీతక్క 1988లో నక్సల్స్ లో చేరారు. పదో తరగతి చదువుతూ ఫూలన్ దేవి నుంచి స్ఫూర్తి పొందిన అనసూయ మావోయిస్టుల్లోకి వెళ్లి సీతక్కగా మారారు. ప్రధానంగా ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆమె పోరాటం సాగింది. దాదాపు రెండు దశాబ్దాలు తన జీవితాన్ని అడవులకే పరిమితం చేసింది. కొండలు, గుట్టలు దాటుతూ ప్రభుత్వంపై పోరాటం చేస్తూ మావోయిస్టుల తరుపున ఆదివాసీలకు అండగా నిలిచేందుకు అన్ని విధాలుగా కృషి చేసింది. అయితే ఆ తర్వాత కొంత సైద్ధాంతిక విభేదాలు తలెత్తి ఆమె మావోయిస్టు ఉద్యమం నుంచి బయటకు వచ్చారు. వచ్చీ రావడంతోనే ఆమె అప్పటి టీడీపీ నేత చంద్రబాబు దృష్టిలో పడ్డారు.
టీడీపీ నుంచి...
2004లో తొలి సారి టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయినా ఆమె నిరాశ చెందలేదు. ఆ తర్వాత మళ్లీ 2009లో టీడీపీ నుంచి పోటీ చేసి తొలి సారి శాసనసభలో కాలుమోపారు. 2014లో రాష్ట్రంలో అత్యధిక స్థానాలు బీఆర్ఎస్ కు లభించడంతో ములుగు నియోజకవర్గం నుంచి సీతక్క విజయం సాధించలేకపోయారు. 2018 లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. కరోనా సమయంలో ఆమె గిరిజనులకు అందుబాటులో ఉన్న తీరు అందిరినీ ఆకట్టుకుంది. అందరూ సీతక్కలయితే బాగుండు కదా? అన్న చర్చ కూడా సోషల్ మీడియాలో జరిగిందంటే అతిశయోక్తి కాదు. మైళ్ల దూరం అడవిలోకి నడిచి వెళ్లి మరీ అటవీపుత్రులకు కరోనా సమయంలో మందులు, ఆహారం వంటివి అందించి శభాష్ అనిపించుకుంది.
రేవంత్ తో ...
టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన సీతక్క రేవంత్ వెంటే నడిచారు. రేవంత్ తన సోదరుడిగా భావించి తొలి నుంచి ఆయననే అంటిపెట్టుకున్నారు. అదే ఇప్పుడు ఆమెకు ప్లస్ గా మారింది. గిరిజన వర్గానికి చెందిన సీతక్క తొలిసారి మంత్రి వర్గంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆదివాసీలు ఈ వార్తతో పండగ చేసుకుంటున్నారు. తమలో ఒకరిగా తిరిగిన మహిళకు అత్యున్నత పదవి లభిస్తుందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను సీతక్క మంత్రిగా బాధ్యతలను చేపట్టి సులువుగా పరిష్కరించగలుగుతుందన్న భావనలో గిరిజనులున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా సీతక్క అని ప్రేమగా పిలుస్తారంటే ఆమెకు పార్టీలో ఉన్న ఇమేజ్ చెప్పకనే చెప్పొచ్చు.
Next Story