Thu Dec 19 2024 00:19:59 GMT+0000 (Coordinated Universal Time)
వణుకుతున్న నేతలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన నేడు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించనున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన నేడు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు తాడేపల్లి కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, మంత్రులు, నియోజకవర్గాల ఇన్ఛార్జులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో జగన్ చివరి సారి ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇవ్వనున్నారు. తమ పనితీరు మెరుగుపర్చుకోని ఎమ్మెల్యేల జాబితాను జగన్ ఈ సమావేశంలో బయటపెట్టే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ప్రత్యామ్నాయంగా...
ఇప్పటి వరకూ గడప గడపకు ప్రభుత్వంపై ప్రతి రెండు, మూడు నెలలకు ఒకసారి సమీక్షలు చేస్తున్న జగన్ పనితీరు సక్రమంగా లేని ఎమ్మెల్యేలను హెచ్చరిస్తూ వస్తున్నారు. అయితే ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఇక పనితీరు మెరుగుపర్చుకోని వారికి అవకాశం ఇచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది. నిర్మొహమాటంగా వారిని పక్కన పెట్టేయడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను ఇప్పటికే జగన్ గుర్తించారు. మరోసారి అధికారంలోకి వస్తే వీరికి ప్రత్యామ్నాయంగా పదవులు ఇస్తామని హామీ ఇవ్వడం మినహా టిక్కెట్లు దక్కడం కష్టమే.
కొందరు ఎమ్మెల్యేలపై...
మొత్తం ఎమ్మెల్యేల్లో పది హేను నుంచి ఇరవై మంది ఎమ్మెల్యేల పనితీరు మాత్రం బాగాలేదని తెలిసింది. వీరందరికీ ప్రత్యామ్నాయ నేతలను కూడా వైసీీపీ హైకమాండ్ చూసి పెట్టుకుందన్నారు. వరస సర్వేలతో ఈ నివేదికలను జగన్ తెప్పించుకున్నారు. కార్యకర్తలకు అందుబాటులో ఉండకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, వ్యాపారాలు, ఇతర వ్యాపకాలపై దృష్టి పెట్టడం వంటి కారణాలతో కొంత మంది ఎమ్మెల్యేలను విధిగా పక్కన పెట్టేయాల్సిన పరిస్థిితి కనిపిస్తుంది.
సీనియర్లు కూడా...
ముఖ్యంగా ఈ జాబితాలో సీనియర్ నేతలు కూడా ఉన్నారని తెలిసింది. కొందరు మంత్రులు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్న చోట ఆల్టర్నేటివ్గా మరో బలమైన నేతల పేర్లు కూడా జగన్ వద్ద సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారికి ఈ ఎన్నికల్లో మద్దతిస్తే భవిష్యత్ ఉంటుందని కూడా నేటి సమావేశంలో చెప్పనున్నారని తెలిసింది. అందుకే గడప గడపకు ప్రభుత్వం చివరి సమావేశంగా చెబుతున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల్లో ఈ సమావేశంలో ఎవరి పేర్లు బయట పెడతారోనన్న టెన్షన్ మాత్రం ఉంది.
Next Story