Tue Dec 24 2024 00:38:19 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఏపీ ఎన్నికలలో సంక్షేమ పథకాలు కీలకం కానున్నాయా? అదే నిజమైతే?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఇంకా పెద్దగా సమయం లేదు. తొంభయి రోజులు మాత్రమే సమయం ఉంది
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఇంకా పెద్దగా సమయం లేదు. తొంభయి రోజులు మాత్రమే సమయం ఉంది. ఎవరికి వారే ఇప్పుడే గెలుపు తమదేనన్న ధీమాలో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతతో గెలుస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు, సంక్షేమ పథకాలతో నెగ్గడం గ్యారంటీ అని అధికార పార్టీ నేత జగన్ ధీమాగా ఉన్నారు. ఇద్దరికీ ఈ ఎన్నికలు కీలకమే. ఎందుకంటే.. ఏపీలో రెండు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు జనం చూశారు. కేవలం పదేళ్ల వ్యవధిలోనే రెండు దఫాలు రెండు పార్టీలు అధికారంలోకి వచ్చాయి. అందుకే గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వ పనితీరును ప్రజలు అంత తేలిగ్గా మరచిపోరు. ఇద్దరి పాలనను బేరీజు వేసుకుని మరీ ఓటు వేస్తారు.
తమ ఖాతాలోనే...
అయితే ఈసారి సంక్షేమ పథకాలు ఎంత వరకూ పనిచేస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. జగన్ అయితే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సంక్షేమ పథకాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తూ వస్తున్నారు. ఎన్ని కష్టాలున్నప్పటికీ సంక్షేమ పథకాలను ఆపలేదన్న పేరును మాత్రం జగన్ తెచ్చుకున్నారు. దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయల నిధులను నేరుగా లబ్దిదారులకు అందించారు. దాదాపు మూడున్నర లక్షల కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందినట్లు వైసీపీ సగర్వంగా ప్రకటించుకుంటుంది. ఆ ఓట్లన్నీ తమ ఖాతాలోనే వేసుకుంటుంది. ప్రభుత్వం నుంచి లబ్ది పొందిన వారెవ్వరూ పక్క చూపులు చూడరన్న అభిప్రాయంలో జగన్ అండ్ కో ఉంది.
పక్క రాష్ట్రంలో...
అదే సమయంలో చంద్రబాబు ధీమా వేరే విధంగా ఉంది. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోనూ కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు పర్చినా అక్కడ వర్క్ అవుట్ కాలేదు. సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వమైనా ఇస్తుందన్న నమ్మకం ప్రజల్లో ఉండటమే కేసీఆర్ ఓటమికి ఒక కారణమయితే.. మార్పును కోరకోవడం మరో బలమైన రీజన్ గా చెప్పాలి. ఇప్పుడు ఏపీలో కూడా అదే పరిస్థితి ఉందని చంద్రబాబు నమ్ముతున్నారు. ముఖ్యంగా జనసేనతో పొత్తు తనకు కలసి వస్తుందన్న నమ్మకంతో చంద్రబాబు విశ్వాసంతో ఉన్నారు. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు, శాతాన్ని చూసుకుంటే తామే అధికారంలోకి వచ్చినట్లు ఆయన డిసైడ్ అయిపోతున్నారు.
జేపీ చెప్పినట్లు...
అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాజీ ఐఏఎస్ అధికారి, లోక్సత్తా మాజీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ చెప్పినట్లుగా ఒక వీడియో కొంత పార్టీలను గందరగోళంలోకి నెట్టేస్తుంది. జగన్ ఈసారి ఓటమి పాలయితే చంద్రబాబు సంక్షేమ పథకాలను అమలు చేయరని, సంక్షేమ పథకాలు అమలు చేసినా జగన్ ను ప్రజలు ఆదరించలేదు కాబట్టి చంద్రబాబు కేవలం అభివృద్ధిపైనే ఫోకస్ పెడతారని ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నిజంగా ఏ సందర్భంలో జేపీ ఈ వ్యాఖ్యలు చేశారన్నది తెలియకున్నా.. ఒకటి మాత్రం నిజం జగన్ ఓటమి పాలయితే.. నిజంగా జేపీ చెప్పినట్లు చంద్రబాబు వెల్ఫేర్ స్కీమ్స్ పైన కన్నా డెవలెప్మెట్పైనే సైకిల్ పార్టీ ఛీఫ్ ఫోకస్ పెట్టే అవకాశముందన్నది వాస్తవం.
Next Story