Thu Dec 19 2024 23:40:38 GMT+0000 (Coordinated Universal Time)
Alliances : పుచ్చుకుంటారా? పంచుకుంటారా ? పొత్తులు తెమిలేదెప్పుడో మరి?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఇంకా యాభై రెండు రోజుల సమయం కూడా లేదు. అయినా ఇంత వరకూ పొత్తులు ఒక కొలిక్కి రాలేదు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఇంకా ఎంతో సమయం లేదు. గట్టిగా ఇంకా యాభై రెండు రోజుల సమయం కూడా లేదు. అయినా ఇంత వరకూ పొత్తులు ఒక కొలిక్కి రాలేదు. టీడీపీ, జనసేన పొత్తు ఖరారయింది. సీట్ల పంపకాలు కూడా పూర్తయ్యాయని చెబుతున్నా ఎలాంటి లీకులు బయటకు రాలేదు. జనసేనకు ఎన్ని సీట్లు అన్నది తేలలేదు. ఎక్కడ పోటీ చేస్తుందన్నది క్లారిటీ రాలేదు. ఈలోగా చంద్రబాబు పది రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి వచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. భేటీ వివరాలు,చివరకు ఫొటోలు కూడా బయటకు రాలేదు. అర్ధరాత్రి జరిగిన ఈ భేటీలో ఏ అంశాలపై చర్చ జరిగిందో బయటకు రాలేదు.
ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత...
కానీ ఎన్డీఏ లో చేరాలని చంద్రబాబును అమిత్ షా ఆహ్వనించారని, అందుకు చంద్రబాబు అంగీకరించారని కూడా వార్తలొచ్చాయి. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత ఈ భేటీపై పెదవి విప్పలేదు. కనీసం పార్టీ ముఖ్యనేతలతోనూ ఈ విషయం మాట్లాడలేదని తెలిసింది. నేతలతో మాట్లాడినా బయటకు వచ్చే అవకాశముందని భావించిన చంద్రబాబు ఢిల్లీ మీటింగ్ పై మౌనంగానే ఉంటున్నారు. ఇటు చంద్రబాబు వైపు నుంచి కానీ, అటు ఢిల్లీ బీజేపీ నుంచి కానీ ఎటువంటి ప్రకటన ఇంతవరకూ వెలువడలేదు. దీంతో టీడీపీ క్యాడర్ తో పాటు జనసైనికులు కూడా కొంత అయోమయంలో ఉన్నారు. అసలు పొత్తు ఉందా? లేదా? అన్న క్లారిటీ ఇంత వరకూ రాలేదు.
పొత్తుకుదిరినట్లే కనిపిస్తున్నా...
జరిగిన సమావేశం చూస్తుంటే పొత్తు కుదిరినట్లే కనిపిస్తుంది. అదే సమయంలో ఆ భేటీ తర్వాత జరుగుతున్న పరిణామాలతో పలు సందేహాలు తలెత్తుతున్నాయి. బీజేపీ ఢిల్లీలో పార్టీ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తుంది. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. మరో వారం రోజుల తర్వాత పార్లమెంటు బోర్డు సమావేశమవుతుందట. ఆ సమావేశంలోనే ఏపీలో పొత్తులపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని కొందరు చెబుతుండగా, మరికొందరు మాత్రం పొత్తులపై ఢిల్లీ నుంచి ప్రకటన మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన బీజేపీ హైకమాండ్ ఇంకా ఏపీ వరకూ రాలేదంటున్నారు.
ఇంకా ఆలస్యమయితే...
ఉత్తర భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో పొత్తులు ఖరారయిన తర్వాతనే దక్షిణ భారతదేశంలో పొత్తులపై చర్చిస్తారని మరికొందరు చెబుతున్నారు. మరీ ఆలస్యమయితే ఇప్పుటికే అభ్యర్థుల ఖరారులో ఆలస్యమవుతుందని భావించిన తెలుగు తమ్ముళ్లు మరింత జాప్యం జరిగితే ఊరుకునేట్లు లేరు. తాము ఎప్పుడు జనంలోకి వెళ్లాలి? ఎలా వారిని కలుసుకుని పార్టీ మ్యానిఫేస్టోను తీసుకెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. జాబితా ఖరాయినప్పటికీ ఇక్కడి బీజేపీ నేతలు మాత్రం తాము యాచించే పరిస్థితుల్ల లేమని, ఇచ్చే పుచ్చుకునే సీన్ కాదని, చర్చించి పంచుకోవడమే మంచిదని హాట్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో బీజేపీ ఎన్ని సీట్లు డిమాండ్ చేస్తుంది. చంద్రబాబు అందుకు అంగీకరిస్తారా? లేదా? సర్దుకుపోతారా? అన్నది ఎటూ తేలకుండా ఉంది.
Next Story