Tue Dec 24 2024 01:10:43 GMT+0000 (Coordinated Universal Time)
Vanitha : హోంమంత్రి తానేటి వనితను మార్చడంలో రీజన్ ఏంటి.. అసలు కారణమిదేనంటున్న పార్టీ నేతలు
హోం మంత్రి తానేటి వనితకు స్థాన చలనం కలిగింది. ఆమెను కొవ్వూరు నియోజకవర్గం నుంచి గోపాలపురానికి షిఫ్ట్ చేశారు
హోం మంత్రి తానేటి వనితకు స్థాన చలనం కలిగింది. ఆమెను కొవ్వూరు నియోజకవర్గం నుంచి గోపాలపురానికి షిఫ్ట్ చేశారు. అయితే ఇది ఆమె పనితీరు బాగాలేదని కొవ్వూరు నుంచి మార్చారా? లేక మరేదైనా కారణముందా? అన్న అనుమానం చాలా మందిలో కలుగుతుంది. కానీ తానేటి వనితను మార్చడానికి అనేక కారణాలున్నాయి. కొవ్వూరులో ఆమెపై పార్టీలో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ ఓడిపోయే స్థాయిలో లేదు. అయితే అదే సమయంలో గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై ఉన్న తీవ్ర వ్యతిరేకత ఆమె బదిలీకి కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే తానేటి వనితను కొవ్వూరు నుంచి గోపాలపురానికి షిఫ్ట్ చేశారంటున్నారు.
జగన్ వెంటే నడిచి...
తానేటి వనిత రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చారు. విద్యావంతురాలు. ఎమ్మెస్సీ, ఎంఈడీ చేశారు. ఆయన తండ్రి జొన్నకూటి బాబాజీరావు గోపాలపురం ఎమ్మెల్యేగా పనిచేశారు. తానేటి వనిత నేపథ్యం కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారే. ఆమె 2009లో గోపాలపురం నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి శాసనసభలోకి అడుగుపెట్టారు. 2012లో టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వనిత వైసీపీలో చేరారు. ఆమె జగన్ వెంటే నడిచారు. జగన్ 2104లో తానేటి వనిత పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. అయితే 2014లో కొవ్వూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
రెండు విడతలు మంత్రిగా...
2019 ఎన్నికల్లో తిరిగి కొవ్వూరు నుంచే విజయం సాధించారు. జగన్ మంత్రి వర్గంలో పూర్తిస్థాయి మంత్రిగా కొనసాగుతున్నారు. రెండుసార్లు విస్తరణ జరిగినా ఆమెను జగన్ కేబినెట్ నుంచి తప్పించకపోవడానికి ప్రధాన కారణం తన వెన్నంటి తొలి నుంచి ఉండటమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తొలి మంత్రివర్గంలో మహిళ శిశు సంక్షేమ శాఖను నిర్వహించారు. రెండో దఫా విస్తరణలో వనితకు కీలకమైన హోంశాఖను అప్పగించారు. అలాంటి తానేటి వనిత ఇప్పుడు తిరిగి గోపాలపురం నుంచి పోటీ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గోపాలపురంలో వనిత అయితేనే గెలుపు ఖాయమని సర్వే నివేదికలు స్పష్టం చేయడంతో ఆమెను మార్చారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
తలారిపై వ్యతిరేకతతోనే....
మరోవైపు గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై ఆయన నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండకుండా టీడీపీ వారిని ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రధానంగా 2022 లో వైసీపీ నాయకుడు గంజి ప్రసాద్ హత్య జరిగిన సమయంలో ఆయనను గ్రామస్థులు కొన్ని గంటల పాటు నిర్బంధించారంటే పరిస్థితి ఏ స్థాయికి నాడు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. చివరకు తానేటి వనిత అక్కడకు వెళ్లి గ్రామస్థులకు సర్ది చెప్పాల్సి వచ్చింది. దీంతో తలారి వెంకట్రావును గోపాలపురం నుంచి కొవ్వూరుకు మార్చారు. ఆ ఘటన జరిగినప్పుడే తలారి వెంకట్రావును తప్పిస్తారన్న ప్రచారం జరిగింది. అనుకున్నట్లుగానే తలారిని బదిలీ చేసినా ఆయన కోసం తానేటి వనితకు మాత్రం స్థాన చలనం తప్పలేదు.
Next Story