Mon Nov 18 2024 00:25:23 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : షర్మిలకు టచ్ లోకి లీడర్లు.. కాంగ్రెస్ లోకి వరస పెట్టనున్న నేతలు
వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఏపీ రాజకీయాలు మారుతున్నాయి. పాత నేతలు కాంగ్రెస్ లోకి వచ్చేందుకు క్యూ కడుతున్నారు
వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చకా చకా మారుతున్నాయి. ఎక్కువ మంది పాత నేతలు కాంగ్రెస్ లోకి తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రులుగా పనిచేసిన వారిలో కొందరు ఇప్పటికే కాంగ్రెస్ లోకి వస్తామని సంకేతాలను పంపుతున్నారట. అందులో కొణతాల రామకృష్ణ కూడా ఉన్నారని చెబుతున్నారు. కొణతాల రామకృష్ణతో పాటు మరో తొమ్మిది మంది మాజీ మంత్రుల వరకూ కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధం అవుతున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారంలో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ కాంగ్రెస్ లో కావాల్సినంత స్పేస్ ఉండటంతో దానివైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతారని తెలిసింది.
పొత్తులో భాగంగా...
ఇటు తెలుగుదేశం పార్టీ, అటు వైసీపీలో టిక్కెట్లు రాని వారు కూడా కాంగ్రెస్ వైపు చూసే అవకాశముందని తెలుస్తోంది. కాంగ్రెస్ కు ఒక అడ్వాంటేజీ ఉంది. సింబల్. గుర్తును ప్రత్యేకంగా ప్రజలకు పరిచయం చేయనక్కర లేదు. టీడీపీ, జనసేన పొత్తు కుదిరితే అనేక ముఖ్యమైన నేతల తమ నియోజకవర్గాలను కోల్పోయే అవకాశముంది. త్యాగాలకు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే చంద్రబాబు నేతలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అయితే తమకు బెటర్ ఆప్షన్ గా నేతలు భావిస్తున్నారు. టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థి, వైసీపీ అభ్యర్థి మధ్య తాము ఎన్నికల బరిలోకి దిగితే గెలుపు సులువుగా దక్కుతుందని అంచనా వేసుకుంటున్నారు.
టిక్కెట్ దక్కని వారు...
వైసీపీలోనూ టిక్కెట్ దక్కని వారు కూడా ఇదే ప్రయత్నంలో ఉంటారని తెలిసింది. ఎవరూ తమ నియోజకవర్గానికి దూరంగా ఉండాలని భావించడం లేదు. పొత్తులతో తమను నియోజకవర్గానికి దూరం చేస్తే తాము లైఫ్ టైం నష్టపోతామని నేతలు భావించి వారు కాంగ్రెస్ లోకి వెళ్లి అయినా తమ అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. పోటీ చేసి ఓడిపోవడం వేరు.. అసలు పోటీలో ఉండకుండా ఉండటం వేరు. రెండింటికీ తేడా చాలా ఉంది. రాజకీయ నేతలు పోటీకి దూరంగా ఉన్నారంటే జనంతో పాటు క్యాడర్ కూడా తమను మర్చిపోయే అవకాశముంటుంది. అందుకే ఫలితాల తర్వాత అధికార పార్టీలోకి వచ్చే వీలు ఎటూ ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికే ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు.
కమ్యునిస్టులు కూడా...
దీంతో మరో టాక్ కూడా వినపడుతుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలసి పోటీ చేస్తే ఏపీలో కాంగ్రెస్, కమ్యునిస్టులు కలసి పోటీ చేయనున్నాయి. అది కూడా కొంత అడ్వాంటేజీగా కొందరు భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలినా, చీలికపోయినా తమ రాజకీయ భవిష్యత్ ను నాశనం చేసుకునే పరిస్థితి ఉండదు. అందుకే కాంగ్రెస్ కు ఈసారి అభ్యర్థుల కొరత ఉండదన్న లెక్క వినపడుతుంది. షర్మిల కాంగ్రెస్ లో పూర్తి స్థాయి బాధ్యతలను స్వీకరించిన తర్వాత ముఖ్యమైన నేతలంతా పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. ఇందుకోసం ఇప్పటికే కొందరు నేతలు షర్మిలతో టచ్ లోకి వచ్చినట్లు చెబుతున్నారు. మొత్తం మీద పదేళ్ల తర్వాత ఏపీ కాంగ్రెస్ కు అభ్యర్థుల పరంగా మాత్రం ఈ ఎన్నికల్లో ఇబ్బంది ఉండదన్నది విశ్లేషకుల అంచనాగా వినిపిస్తుంది.
Next Story