175సీట్లు ఎందుకు గెలవలేమో చెప్పాలని అడుగుతున్న ఏపీ సీఎం.. సమాధానం ఏమిటో ?
పార్టీకి చెందిన గ్రాఫ్‌ను మొత్తం 100 శాతం అనుకుంటే అందులో తన పనితీరుకు గ్రాఫ్ 60 శాతమని తెలిపారు జగన్. తన గ్రాఫ్ బాగానే ఉందని..
అమరావతి : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ ముఖ్య నేతలు, మంత్రులు, పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మొత్తం 175 సీట్లుంటే వాటన్నింటిలోనూ వైసీపీ ఎందుకు గెలవకూడదని జగన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. 2024 ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా జరిగిన ఈ సమావేశంలో జగన్ మాట్లాడుతూ... 'మంత్రులు అందరినీ కలుపుకుని వెళ్లాలి. ప్రతి ఎమ్మెల్యే నెలకు 10 సచివాలయాలు తిరగాలి. గత ఎన్నికల్లో 151 సీట్లు గెలిచాం. వచ్చే ఎన్నికల్లో ఈ సీట్ల సంఖ్య తగ్గకూడదు. అసలు 175కి 175 సీట్లు ఎందుకు గెలవకూడదు?' అని జగన్ వ్యాఖ్యానించారు.
పార్టీకి చెందిన గ్రాఫ్‌ను మొత్తం 100 శాతం అనుకుంటే అందులో తన పనితీరుకు గ్రాఫ్ 60 శాతమని తెలిపారు జగన్. తన గ్రాఫ్ బాగానే ఉందని.. మిగిలిన 40 శాతం గ్రాఫ్ పార్టీ నేతలదేనని వైఎస్ జగన్ తెలిపారు. ఎవరి గ్రాఫ్ బాగుంటే వారికే టికెట్లు కేటాయిస్తామని చెప్పారు. ఎన్నికల్లో గెలిచే వారికే టికెట్లు ఇస్తామన్న ఆయన... గెలవలేని వారిని పక్కనపెట్టేస్తామని చెప్పేశారు. జులై 8న పార్టీ ప్లీనరీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు జగన్. మే 10న గడప గడపకు వైసీపీ కార్యక్రమాన్ని ప్రారభించనున్నట్లు ప్రకటించారు. పాత మంత్రులు, జిల్లా అధ్యక్షులకు కీలక భాధ్యతలు అప్పగిస్తానని జగన్ చెప్పారు.