Tue Dec 24 2024 01:45:45 GMT+0000 (Coordinated Universal Time)
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఏపీ హోంమంత్రి తానేటి వనిత
మహిళా పక్షపాతి అయిన తమ ప్రభుత్వం ఇలాంటి అఘాయిత్యాలను అరికట్టేందుకు దిశ పోలీస్ స్టేషన్లను, దిశ యాప్ను అందుబాటులోకి..
అమరావతి : ఏపీ హోంమంత్రి తానేటి వనిత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బిడ్డల సంరక్షణ బాధ్యత తల్లిదేనని, ఆ పాత్ర సరిగా లేనప్పుడే అత్యాచారాలు వంటివి జరుగుతుంటాయని అన్నారు. విశాఖపట్టణంలోని దిశ పోలీస్ స్టేషన్ను సందర్శించిన వనిత ఈ వ్యాఖ్యలు చేశారు. తండ్రి పనిమీద బయటకు వెళ్లినప్పుడు బిడ్డల సంరక్షణ బాధ్యతను తల్లి చూసుకుంటుందని, ఆమె కూడా ఉద్యోగం కోసమో, కూలి పనుల కోసమో బయటకు వెళ్తుండడంతో పిల్లలు ఇంట్లోనే ఒంటరిగా ఉండిపోతున్నారని అన్నారు. దీనిని అలుసుగా తీసుకుని ఇరుగుపొరుగువారు, బంధువులు, కొన్ని చోట్ల తండ్రులే పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది చాలా బాధాకరమన్నారు. మహిళా పక్షపాతి అయిన తమ ప్రభుత్వం ఇలాంటి అఘాయిత్యాలను అరికట్టేందుకు దిశ పోలీస్ స్టేషన్లను, దిశ యాప్ను అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఇలాంటి కేసుల్లో ఏడు రోజుల్లోనే విచారణ పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేస్తామని చెప్పారు. టీడీపీ హయాంలోనూ మహిళలపై అఘాయిత్యాలు జరిగాయని, అయితే అప్పుడు వారు బయటకు వచ్చి చెప్పుకునే అవకాశం లేకపోవడం వల్లే కేసులు వెలుగులోకి రాలేదని మంత్రి అనిత వివరించారు.
మహిళలు, బాలికలపై జరుగుతోన్న అమానుష ఉదంతాలు తనని తీవ్రంగా కలిచి వేస్తున్నాయన్నారు. దిశ పోలీస్స్టేషన్లు రాష్ట్రవ్యాప్తంగా ఆపదలో ఉన్న 900 మంది మహిళలకు రక్షణ కల్పించాయని వివరించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1.24 కోట్ల మంది ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నట్లు చెప్పారు. విశాఖ దిశ పోలీస్ స్టేషన్ పరిధిలో 7.31 లక్షల మంది ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలిపారు.
రమ్య హత్య కేసులో శశికృష్ణకు ఉరి ఖరారు కావడంపై హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. కోర్టు విధించిన ఈ చారిత్రాత్మకమైన తీర్పుని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. హత్య జరిగిన పది గంటల వ్యవధిలో శశికృష్ణను పోలీసులు అరెస్ట్ చేయడంతో పాటు వారం రోజుల్లో ఛార్జ్ షీటు వేశారని తెలిపారు. 8 నెలల వ్యవధిలో తీర్పు వచ్చిందని, రమ్య కేసులో తీర్పుపై దిశ చట్టం ప్రభావం ఉందన్నారు.
Next Story