Mon Dec 23 2024 11:11:01 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : ఈసారి చంద్రబాబు ఎవరినీ నమ్మడం లేదట.. ఎవరి జోక్యం లేకుండా ఒంటరిగా కూర్చుని?
ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నారు
అవును చంద్రబాబు ఇప్పుడు పూర్తిగా ఛేంజ్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించి తాము అధికారంలోకి రావడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా సరైన అభ్యర్థులను ఎంపిక చేేసే బాధ్యతను ఆయనే స్వయంగా తీసుకున్నారు. గతంలోనూ చంద్రబాబు మాత్రమే అభ్యర్థుల ఎంపికను చేసేవారు. అయితే సుజనా చౌదరి వంటి నమ్మకమైన వారితో ఒక టీం ను ఏర్పాటు చేసి స్క్రూటినీ చేసిన తర్వాత కొన్ని పేర్లను తాను పరిశీలించి అనంతరం అభ్యర్థులను ఆయన ప్రకటించే వారు. 2019 ఎన్నికల్లోనూ తొలుత స్క్రీనింగ్ కమిటీ లో నిర్ణయించిన అభ్యర్థుల్లో ఒకరిని చంద్రబాబు ఎంపిక చేశారు.
అంతా తానే అయి...
కానీ ఈసారి స్క్రీనింగ్ కమిటీ అంటూ ఏమీ లేదు. మరొకరిని టిక్కెట్ల కేటాయింపులో భాగస్వామ్యం చేయదలచుకోలేదు. అందుకే ఆయనే స్వయంగా పార్టీ కార్యకర్తల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఫైనలైజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. టీడీపీలో మరొక నేతకు ఈ బాధ్యతను అప్పగించలేదు. చివరకు సీనియర్ నేతల జోక్యం గాని, వారి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకునేందుకు ఇష్టపడటం లేదు. భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతాయని కావచ్చు. లేదా ఎంపికలో తప్పిదాలు జరగవచ్చని ఆయన భావించి స్వయంగా లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు.
విరామం ప్రకటించి మరీ...
రా కదిలిరా సభలకు కూడా కొంత విరామం ప్రకటించిన చంద్రబాబు కొన్ని కీలక స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేయడానికి గత రెండు రోజుల నుంచి కసరత్తులు చేస్తున్నారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఉంటూ ఆయన ఒక్కరే సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉన్నారని చెబుతున్నారు. ఎవరూ హైదరాబాద్ లోని తన నివాసం వద్దకు రావద్దని కూడా సీనియర్ నేతలకు కూడా ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు నుంచి పిలుపు వస్తేనే వారు వెళ్లి తమ నియోజవకర్గంలో పరిస్థితులను కొందరు తెలిసి వస్తున్నారు. అదీ జేసీ ప్రభకర్ రెడ్డి ఇటీవల భేటీ కావడం కూడా అందులో భాగమే. ఫ్యామిలీ పరంగా ఒక్క టిక్కట్ మాత్రమే ఇస్తామని చంద్రబాబు గతంలో చెప్పడంతో వారికి చెప్పేందుకు, పరిస్థితులను వివరించేందుకే తన ఇంటికి పిలుస్తున్నారు.
మిత్రపక్షానికి...
మరోవైపు జనసేనతో పొత్తు ఉండటంతో ఆ పార్టీకి ఏ ఏ స్థానాలు ఇవ్వాలన్న దానిపై కూడా ఆయన స్వయంగా పరిశీలన చేస్తున్నారు. గత ఎన్నికల ఫలితాల్లో జనసేనకు వచ్చిన ఓట్ల శాతం, అక్కడ టీడీపీకి పోలయిన ఓట్లు అన్ని బేరీజు వేసుకుని మిత్రపక్షానికి ఇచ్చే సీట్ల జాబితాను ఆయన సిద్ధం చేయనున్నారు. ఇరవై నుంచి ముప్ఫయి శాసనసభ స్థానాలతో పాటు రెండు నుంచి మూడు పార్లమెంటు స్థానాలను జనసేనకు కేటాయించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అందుకోసమే ఎవరూ చంద్రబాబును డిస్ట్రబ్ చేయకుండా హైదరాబాద్ లోనే ఉండి జాబితాను రూపొందించే పనిలో ఉన్నారు. మరి లిస్ట్ లో ఎవరి పేర్లు ఉంటాయో? ఎవరు టిక్కెట్లు కోల్పోతారన్నది కూడా త్వరలో తేలనుంది. దీంతో పాటు మ్యానిఫేస్టో రూపకల్పనను కూడా ఆయనే స్వయంగా చేస్తున్నట్లు తెలిసిింది. మొత్తం మీద చంద్రబాబు ఈసారి గెలించేందుకు కసిగా కసరత్తులు చేస్తున్నారు.
Next Story