కేంద్ర మంత్రిగా బండి సంజయ్?.. బీజేపీ మాస్టర్ స్కెచ్ ఇదే
తెలంగాణకు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. నాయకత్వ పునర్వ్యవస్థీకరణపై బీజేపీ తెలంగాణ శాఖలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
తెలంగాణకు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. నాయకత్వ పునర్వ్యవస్థీకరణపై బీజేపీ తెలంగాణ శాఖలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బండి సంజయ్ భవితవ్యం, ఆయనను కేంద్ర మంత్రిగా నియమిస్తారా లేదా రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగిస్తారా అనేది త్వరలో వెల్లడి కానుంది. ఎన్నికల్లో గెలిచేందుకు తెలంగాణపై బీజేపీ అగ్రనాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. త్రిముఖ్య వ్యూహంతో ఎన్నికలకు వెళ్లేందుకు బీజేపీ సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర పార్టీ నాయకత్వంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టేందుకు బీజేపీ రెడీ అయిందని సమాచారం. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ని.. ఆ పదవి నుంచి తప్పించనున్నట్లు పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. బండి సంజయ్‌ని తెలంగాణలో పార్టీ వ్యవహారాల బాధ్యత నుంచి తప్పించి కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది.
సంజయ్‌కి కేంద్రమంత్రిగా లేదా సహాయక మంత్రి బాధ్యతలు అప్పగించనున్నట్లు గుసగుసలు వినబడుతున్నాయి. పార్టీ అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళిక రచిస్తున్న బీజేపీ.. అందులో భాగంగానే రాష్ట్ర పార్టీ నాయకత్వంలో మార్పులకు సిద్ధమైందని సమాచారం. అందులో భాగంగానే బండి సంజయ్‌కి కేంద్రమంత్రి పదవి కట్టబెట్టాలని చూస్తోంది. ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన సంజయ్‌ని మంత్రి పదవిలో కూర్చోబెడితే.. హిందూత్వ అజెండాను జనాల్లోకి మరింత లోతుగా తీసుకెళ్తాడని బీజేపీ అగ్ర నాయకత్వం విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రమంత్రిగా బండి సంజయ్‌కి ఉండే ప్రోటోకాల్, స్పీచ్‌లు వచ్చే ఎన్నికల్లో పార్టీకి మరింత ఊపు తెచ్చే అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది. ఒక వేళ ఇదే జరిగితే కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్‌రెడ్డిని ప్రస్తుత మంత్రి పదవి నుంచి తప్పించి తెలంగాణలో పార్టీ వ్యవహారాలను అప్పగించే అవకాశం ఉంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కిషన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. దాంతో పార్టీతో ఆయనకు ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. కిషన్ రెడ్డికి పార్టీ అధ్యక్ష బాధ్యతలను ఇస్తే.. అందరినీ కలుపుకుని పోతాడని, అలాగే రెడ్డి సామాజిక వర్గానికి మరింత దగ్గర కావొచ్చని బీజేపీ అనుకుంటోంది. పార్టీలో మార్పులు చేపడితే.. ఈటల రాజేందర్‌కు కూడా కీలక పదవిని కట్టబెట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఈటల చేరికల కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. అయితే ఆ పదవి పట్ల ఈటల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈటలకు ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారు. ఈ పదవిని అప్పగిస్తే.. పార్టీ అధ్యక్ష పదవికి సరిసమానంగా ఉంటుంది.