Mon Dec 23 2024 00:40:11 GMT+0000 (Coordinated Universal Time)
BJP : పార్టీ బలం పెరిగిందా? ఫిగర్ లో మాత్రం ఓకే... కానీ?
తెలంగాణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తన బలం పెంచుకుంది. 2018 ఎన్నికల్లో ఒక స్థానానికే పరిమితమయింది.
తెలంగాణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తన బలం పెంచుకుంది. 2018 ఎన్నికల్లో ఒక స్థానానికే పరిమితమయింది. హేమాహేమీలందరూ ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కిషన్ రెడ్డి నుంచి కె లక్ష్మణ్..ఇలా ఎవరైనా శాసనసభ గడప తొక్కలేకపోయారు. ఒక్క రాజాసింగ్ మాత్రమే గెలిచారు. అదే గోషామహల్ నుంచి. అలాంటి బీజేపీ ఆ తర్వాత జరిగిన రెండు ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలిచి పార్టీ బలాన్ని మూడు పెంచగలిగారు. దీంతో శాసనసభలో బీజేపీ బలం మూడుకు చేరుకోవడానికి సర్వశక్తులు ఒడ్డాల్సి వచ్చింది.
ఒకేసారి ఎనిమిది మంది...
కానీ ఇప్పుడు ఏకబిగిన ఒకేసారి ఎనిమిది మంది శాసనసభలోకి బీజేపీ కండువాలు కప్పుకుని అడుగుపెడుతున్నారు. ఖచ్చితంగా ఇది రాష్ట్ర నేతల ఘనత మాత్రం కానే కాదు. వారికి ఇందులో ఏ మాత్రం ప్రమేయం లేదు. ఈఎన్నికల్లోనూ హేమాహేమీలు ఓటమి బటా పట్టగా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు ఎక్కువ మంది గెలిచారు. పన్నెండు మందిలో పాత వారిలో రాజాసింగ్ తప్పించి ఎవరూ లేరు. ఇప్పుడు శాసనసభ పక్ష నేతగా రాజాసింగ్ కు తప్పించి మరొకరికి ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే గెలిచిన వారిలో పార్టీలో సీనియర్ నేతగా రాజాసింగ్ ను మాత్రమే చూడాల్సి ఉంటుంది. కానీ రాజాసింగ్ కు ఆ పదవి దక్కుతుందా? లేదా? అన్నది మాత్రం ఇంకా తెలియడం లేదు.
జాతీయ నేతల ప్రచారం...
రాష్ట్ర నేతల వల్ల ఇక్కడ ఓటు బ్యాంకు పెంచుకున్న దాఖలాలు ఎటు చూసినా కన్పించలేదు. ప్రధాని మోదీ వరస పర్యటనలు, అమిత్ షాతో పాటు ఇతర మంత్రుల పర్యటనలు కొంత ఊపును తెచ్చిపెట్టాయి. అంతేకాదు ప్రధాని హోదాలో నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ప్రకటించడం, సమ్మక్క సారలమ్మ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు, ఎస్సీ వర్గీకరణ వంటి హామీలు ఆ పార్టీకి ఓట్లు తెచ్చి పెట్టాయి. కొన్ని ప్యాకెట్లలోనే అది గెలవగలిగింది. హైదరాబాద్ లాంటి నగరంలో ఒకే ఒక చోట గెలిచిన బీజేపీ ఆదిలాబాద్, నిజామాబాద్ చోట మరోసారి కమలం విరిసింది. దీనికి కారణం జాతీయ స్థాయి నేతల హామీలు..వారి పర్యటనలు అని చెప్పక తప్పదు. అంతే తప్ప రాష్ట్ర స్థాయి నేతలను చూసి ఎవరూ ఓటేయలేదన్నది మాత్రం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం అని అంగీకరించాల్సిందే.
వ్యక్తిగత ఇమేజ్...
అలాగే గెలిచిన వాళ్లలో అధిక మంది వ్యక్తిగత బలం ఉన్నవాళ్లే కావడం విశేషం. పార్టీ కన్నా అభ్యర్థుల బయోడేటానే ఎన్నికల నుంచి బయటపడేసింది. ఉదాహరణకు నిర్మల్ తీసుకుంటే కాంగ్రెస్ నుంచి వచ్చిన మహేశ్వర్ రెడ్డి గెలిచారు. అంటే ఆయన వ్యక్తిగత ఓటు బ్యాంకుతో విజయం సాధించినట్లే అనుకోవాలి. అలాగే కామారెడ్డిలోనూ తొలి నుంచి కష్టపడి పనిచేసిన కాటిపల్లి వెంకటరమణా రెడ్డి ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్, అటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఓడించారంటే పార్టీ బలం కంటే ఆయన ఇమేజ్ ఎక్కువన్నది చెప్పక తప్పదు. ఇలా పార్టీ బలపడిందని భావించే దానికన్నా వ్యక్తిగత ఇమేజ్ తోనే ఎక్కువ మంది ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచారన్నది వాస్తవం. అది పార్టీ బలంగా చూసుకుని విర్రవీగితే అంతకంటే వెర్రితనం మరొకటి ఉండదు. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లోనూ మళ్లీ ఇవే ఫలితాలు వస్తాయన్న గ్యారంటీ కూడా లేదు.
Next Story