Fri Nov 22 2024 21:03:31 GMT+0000 (Coordinated Universal Time)
చిన్నమ్మ ట్రోల్ అవుతున్నారు... నష్టమేగా?
బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు, ఎన్టీఆర్ కుమార్తె పురంద్రీశ్వరి పై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్త్ున్నారు
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా బాధ్యతలను చేపట్టిన ఎన్టీఆర్ కుమార్తె పురంద్రీశ్వరి పై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్త్ున్నారు. బీజేపీలో ఉంటూ టీడీపీ పక్షాన నిలుస్తున్నారంటూ కామెంట్స్ పెడుతున్నారు. పురంద్రీశ్వరి తొలి నుంచి టీడీపీకి అనుకూలంగా ఉన్నారని, చంద్రబాబును జైలు నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు ఆమె చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. నిన్న లోకేష్ అమిత్ షాతో సమావేశమయినప్పుుడు పురంద్రీశ్వరి కూడా అక్కడ ఉన్న విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు.
పొత్తుల ప్రకటన..
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీ కలసి పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి. బీజేపీ ఇంత వరకూ తన స్టాండ్ ను ప్రకటించలేదు. అయితే కొన్ని స్థానాలనైనా దక్కించుకోవాలన్నా, దక్షిణాదిన పార్టీ బలం పెంచుకోవాలన్నా టీడీపీ, జనసేన కూటమితో చేరాలన్న డిమాండ్ రాష్ట్ర స్థాయి నేతల నుంచి ఎక్కువగా వినిపిస్తుంది. సోము వీర్రాజు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వైసీపీపై కొంత సానుకూలంగా ఉండేవారన్న విమర్శలను ఆయన ఎదుర్కొన్నారు. ఇప్పుడు పురంద్రీశ్వరి పక్కా టీడీపీ అంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
సీబీఐ విచారణను...
పురంద్రీశ్వరి అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన నాటి నుంచి అధికార పార్టీపై విరుచుకుపడుతున్నారు. ఆమె ఇటీవల సీబీఐ విచారణను కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మద్యం విక్రయాలపై సీబీఐ విచారణ జరపాలంటూ ఆమె అమిత్ షాను కూడా కోరినట్లు వార్తలు వచ్చాయి. దీంతో పాటు లోకేష్ తో కలసి అమిత్ షాను కలవడంపై సొంత పార్టీ నేతలే కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ బీజేపీలో తొలినుంచి రెండు వర్గాలున్నాయి. ఒకటి టీడీపీ అనుకూల వర్గం కాగా, మరొకటి వ్యతిరేక వర్గం.
రెండు వైపుల నుంచి...
టీడీపీ వల్లనే ఏపీలో పార్టీ ఇప్పటి వరకూ ఎదగలేకపోయిందన్న వాదనను ఇప్పటి వరకూ వినిపించిన నాయకుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. ఈసారైనా ఏపీలో అధికారంలో భాగస్వామ్యులం కావాలని పార్టీలో అధిక శాతం మంది కమలనాధులు కోరుకుంటున్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వం మాత్రం దీనిపై ఇంత వరకూ స్పష్టత ఇవ్వలేదు. జనసేనాని పవన్ కల్యాణ్ మాత్రం తాను ఢిల్లీ వెళ్లి బీజేపీ కూడా తమతో కలసి వచ్చేలా ప్రయత్నిస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో పురంద్రీశ్వరి లోకేష్ తో కలసి అమిత్ షాను కలకవడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటు పార్టీ నుంచి అటు వైసీపీ నుంచి పురంద్రీశ్వరిని టార్గెట్ చేస్తున్నారు.
Next Story