Tue Nov 05 2024 16:24:51 GMT+0000 (Coordinated Universal Time)
బీజేపీ అధ్యక్షులుగా ఏపీకి పురందేశ్వరి.. తెలంగాణకు కిషన్ రెడ్డి
గతంలో కన్నా లక్ష్మీనారాయణను మార్చి సోమును అధ్యక్షుడిగా నియమించింది అధిష్టానం. అయితే సోము వైసీపీకి దగ్గరగా..
తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల విషయంలో హై కమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాల అధ్యక్షులను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా గంగాపురం కిషన్రెడ్డిని నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజును తొలగించి.. ఆ స్థానంలో పురందేశ్వరిని నియమిస్తున్నట్లు బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలో కన్నా లక్ష్మీనారాయణను మార్చి సోమును అధ్యక్షుడిగా నియమించింది అధిష్టానం. అయితే సోము వైసీపీకి దగ్గరగా ఉంటూ ప్రభుత్వ వ్యతిరేకతను బలంగా జనాల్లోకి తీసుకెళ్లడం లేదన్న భావన కేడర్ లో ఉంది. అదే సమయంలో కన్నా వంటి సీనియర్లు పార్టీ వీడటానికి కారణం కూడా సోము తీరేనన్న విమర్శలు లేకపోలేదు. అందుకే సోము స్థానంలో పురందేశ్వరిని ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా హైకమాండ్ నియమించిందని రాష్ట్ర బీజేపీ శ్రేణులు తెలిపాయి. ప్రధానంగా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే ఆలోచనతో బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ పట్ల.. కొత్త నేతల నుంచి వ్యతిరేకత, ఆయనపై ఫిర్యాదులు కూడా అందడంతో హై కమాండ్ తెలంగాణ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ను తొలగించి ఆ బాధ్యతల్ని కిషన్ రెడ్డికి అప్పగించింది. అలాగే తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ఈటల రాజేందర్ కు బాధ్యతల్ని అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చింది బీజేపీ హైకమాండ్. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని పూర్తిస్థాయిలో బలోపేతం చేసేందుకే పార్టీ అధిష్టానం ఈ మార్పులు చేపట్టింది.
తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు బీజేపీ చీఫ్ లను మారుస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పంజాబ్ బీజేపీ చీఫ్ గా సునీల్ జక్కర్, రాజస్థాన్ బీజేపీ చీఫ్ గా గజేంద్రసింగ్ షెకావత్, జార్ఖండ్ బీజేపీ చీఫ్ గా బాబూలాల్ మరాండిలను నియమించింది. అలాగే ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని జాతీయ కార్యవర్గంలోకి తీసుకుంటున్నట్లు తెలిపింది.
Next Story