బీజేపీ నేతలు తెలంగాణకు థ్యాంక్స్ చెప్పాలి: కేటీఆర్
కేంద్రప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రధానమంత్రి మోదీకి అవకాశం ఇస్తే ఢిల్లీని కూడా
కేంద్రప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రధానమంత్రి మోదీకి అవకాశం ఇస్తే ఢిల్లీని కూడా తీసుకెళ్లి గుజరాత్లో పెడతారని అన్నారు. రేపు ప్రజలు ఏకం చేసే అంశాన్ని నమ్ముతాం కానీ రాజకీయ పార్టీలు ఏకం చేసే అంశాన్ని కాదన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో దేశాన్ని అభివృద్ధి చేయడంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ఘోరంగా విఫలం అయ్యాయని ఆరోపించారు. ఇప్పటికీ విద్యుత్, నీటి సరఫరాలేని గ్రామాలు కూడా దేశంలో ఉన్నాయంటే వీటి బాధ్యత పూర్తిగా ఈ రెండు జాతీయ పార్టీలదేనన్నారు. ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా ప్రజల్లో ఐకమత్యం రావాల్సిన అవసరం ఉందన్నారు.
అంశాల వారీగా ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేసే ప్రయత్నాన్ని కొనసాగిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని తెలంగాణ అభివృద్ధిని, నమూనాను దేశవ్యాప్తంగా అమలు చేయాలనుకుంటున్నామని తెలిపారు. నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైన విషయం అందరికీ తెలుసునని అన్నారు. ఎవరు ఎవరితో కుమక్కు అవుతున్నారో ప్రజలకు తెలుసునని పేర్కొన్నారు. దేశంలో ఇప్పటిదాకా పనిచేసిన ప్రధాన మంత్రుల్లోకెల్లా అత్యంత బలహీనమైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని ఎద్దేవా చేశారు. నరేంద్ర మోదీ బలహీనతలను దేశంలో అందరికంటే ఎక్కువగా విమర్శించింది భారత రాష్ట్ర సమితినేనని మంత్రి కేటీఆర్ అన్నారు.
సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు. ఢిల్లీలో తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వ అర్దినెన్సును పార్లమెంట్లో అందుకు వ్యతిరేకంగా నిలబడతామన్నారు. సమైక్య స్ఫూర్తికి వ్యతిరేకమైన ఈ ఆర్డినెన్స్‌ను కాంగ్రెస్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుందో వాళ్లే చెప్పాలని నిలదీశారు. హైదరాబాద్‌లో వరదలు వస్తే సహకరించని కేంద్రం, గుజరాత్ లేదా ఇతర బీజేపీ రాష్ట్రాల్లో వరదలు వస్తే ఎందుకు నిధులిచ్చిందో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలన్నారు. కిషన్ రెడ్డిని కంటే పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తాము ఇవ్వగలమన్నారు. బీజేపీ పాలిత పేద రాష్ట్రాల అభివృద్ధిలోనూ తెలంగాణ రాష్ట్ర నిధులు ఉన్నాయన్నారు. ఈ విధంగా జాతి నిర్మాణంలో తెలంగాణ సహాయకారిగా ఉన్నందుకు బీజేపీ నేతలు తెలంగాణ ప్రజలకు, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపాలన్నారు.