Mon Nov 18 2024 00:18:42 GMT+0000 (Coordinated Universal Time)
KCR : నేడు కరీంనగర్‌కు కేసీఆర్... అక్కడి నుంచే ఎన్నికల శంఖారావం
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను అత్యధిక స్థానాల్లో గెలిపించుకునేందుకు సిద్ధమయ్యారు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను అత్యధిక స్థానాల్లో గెలిపించుకునేందుకు సిద్ధమయ్యారు. నేడు కరీంనగర్ లో కేసీఆర్ పర్యటించనున్నారు. కరీంనగర్ వేదికగా లోక్‌సభ ఎన్నికలకు ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటి వరకూ నియోజకవర్గాల వారీగా పార్టీ అభ్యర్థులపై నేతలతో సమీక్షలు జరిపిన కేసీఆర్ నేటి నుంచి ప్రజల వద్దకు వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఈరోజు సాయంత్రం కరీంనగర్ లోని ఎస్సాఆర్ఆర్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభను బీఆర్ఎస్ నిర్వహించనుంది. ఈ సభకు లక్ష మందిని సమీకరించాలని పార్టీ నేతలకు ఇప్పటికే కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
తొలి సభను...
ఇప్పటికే కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా వినోద్ కుమార్ ను, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ పేర్లను కేసీఆర్ ఖరారు చేశారు. తమకు అచ్చొచ్చిన కరీంనగర్ గడ్డ నుంచే ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. కరీంనగర్ ను ఉద్యమ కాలం నుంచి సెంటిమెంట్ గా భావిస్తారు. అక్కడ అడుగుపెట్టిన ప్రతి పనీ విజయవంతం అవుతుందని ఆయన నమ్ముతారు. అందుకే పార్లమెంటు ఎన్నికల్లో తొలి సభను కరీంనగర్ నుంచే ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ సభ విజయవంతం చేసే పనిని ఇప్పటికే పార్టీ సీనియర్ నేతలకు కేసీఆర్ అప్పగించారు. తొలి సభతోనే ప్రత్యర్థుల నోళ్లు మూయించాలని కేసీఆర్ భావిస్తున్నారు.
నేతలు వెళ్లిపోతున్న సమయంలో...
కరీంనగర్ సభలో కేసీఆర్ ప్రసంగంపైనే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత నల్లగొండలో జరిగిన సభలో కేసీఆర్ పాల్గొన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటికి ఏర్పడి కొద్ది రోజులే అయింది. ఇప్పుడు దాదాపు మూడు నెలలు కావస్తుండటం, ఇచ్చిన హామీలపై కేసీఆర్ ఇదే వేదికపై నుంచి ప్రశ్నిస్తారని చెబుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి పార్టీ నేతలు వెళ్లిపోతున్న నేపథ్యంలో ఈ సభను సక్సెస్ చేసి బీఆర్ఎస్ కు ప్రజల్లో పట్టు తగ్గలేదని నిరూపించుకోవాలని ఆయన భావిస్తున్నారు. అందుకోసమే కరీంనగర్ సభను విజయవంతం చేసేందుకు హరీశ్‌రావు, కేటీఆర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ వంటి నేతలకు అప్పగించారు.
Next Story