Mon Dec 23 2024 15:54:19 GMT+0000 (Coordinated Universal Time)
మట్టి కరిపించాలనే
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పూర్తి విశ్వాసంతో ఉన్నారు. మూడోసారి కూడా గెలుపు ఖాయమన్న ధీమాతో ఆయన ఉన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పూర్తి విశ్వాసంతో ఉన్నారు. మూడోసారి కూడా గెలుపు ఖాయమన్న ధీమాతో ఆయన ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆయన తాను సులువుగా గెలపించుకోగలనన్న నమ్మకంతో ఉన్నారు. కేసీఆర్ వ్యూహాలు విపక్షాలకు అర్థం కాక జుట్టు పీక్కుంటున్నాయి. కేసీఆర్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారోనన్నది ప్రత్యర్థి పార్టీల్లో నెలకొంది. కేసీఆర్ గెలుపుకు గజం దూరంలోనే ఉన్నారన్నది ఆ పార్టీ సీనియర్ నేతల అభిప్రాయం. అది చేరుకునే సమయం కూడా పెద్దగా లేదని, ఈ రేసులో మిగిలిన పార్టీలన్నీ కిలో మీటర్ల కొద్దీ వెనకబడి ఉన్నాయని గులాబీ పార్టీ నేతలు భావిస్తున్నారు.
తక్కువ అంచనా...
కేసీఆర్ ను తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎన్నికలకు ఎన్నికలకు తన స్ట్రాటజీని మార్చుకోగలడు. సులువుగా తనవైపునకు తిప్పుకోగలడు. గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన ధమ్కీని మర్చిపోలేకపోతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ వైపు ప్రజలు మళ్లకుండా కేసీఆర్ తన వ్యూహాలతోనే అధికారాన్ని తన పరం చేసుకున్నారు. ఒకసారి బంగారు తెలంగాణ తనతో సాధ్యమని, రెండోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే కాకుండా మహాకూటమిలో చంద్రబాబును బూచిగా చూపి తెలంగాణ జనాలను తనవైపునకు తిప్పుకుని కాంగ్రెస్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ కు దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు.
వ్యతిరేక ఓటు...
కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను సయితం తన వైపునకు రప్పించుకున్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో వారందరికీ టిక్కెట్లు తిరిగి ఇచ్చారు. వారు గెలిచినా గెలవకపోయినా సీట్లు ఇచ్చి పార్టీ మారిన వచ్చిన వారికి ఖచ్చితంగా సీటు ఇస్తామన్న సంకేతాలను కేసీఆర్ పంపగలిగి విపక్ష పార్టీలను డైలమాలోకి నెట్టేశారు. 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. విపక్షానికి స్పష్టమైన మెజారిటీ వస్తే తప్ప కాస్త అటు ఇటుగా వస్తే మళ్లీ ఆట మొదలుపెట్టడం ఖాయం. ఆ ఆటలో తనదే పైచేయి అయ్యేలా కేసీఆర్ ముందునుంచే ప్లాన్ చేసుకుంటూ వెళుతున్నారు. ప్రత్యర్థి పార్టీలు ఎవరూ తమ దరిదాపుల్లో ఉండకూడదని భావిస్తున్న ఆయన కాంగ్రెస్, బీజేపీలను బలోపేతం చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయే విధంగా ఇప్పటికే చర్యలు తీసుకోనున్నారు.
మ్యానిఫేస్టోను కూడా...
దీంతో పాటు తన సంక్షేమ పధకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు తనకు ఎటూ ఉండనే ఉన్నాయి. ఈ రెండింటితో సులువుగా ప్రత్యర్థులను చిత్తు చేయవచ్చని గులాబీ బాస్ బలంగా విశ్వసిస్తున్నారు. అంతేకాదు మ్యానిఫేస్టోను కూడా త్వరలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ గ్యారంటీ కార్డుకు మించి జనాలపై కేసీఆర్ వరాలు ప్రకటించి చెక్ పెట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునే విధంగా జనరంజకంగా మ్యానిఫేస్టోను రూపొందించి ప్రజల ముందు ఉంచనున్నారు. ఆ తర్వాత జనంలోకి వెళ్లి తాను చేసిన పనులతో పాటు సంక్షేమం, రానున్న కాలంలో చేయబోయే పనులను చెప్పి ప్రత్యర్థులను మట్టికరిపింాచాలన్న వ్యూహంతో కేసీఆర్ ఉన్నారు. మరి ఆయన మ్యానిఫేస్టో ఎలా ఉండబోతుందోనన్న టెన్షన్ మాత్రం కాంగ్రెస్ లో ఉంది.
Next Story