Fri Dec 27 2024 02:59:30 GMT+0000 (Coordinated Universal Time)
KCR : ఏంది బాసూ... అటు వైపు చూసేది ఇక లేదా? అంతలోనే ఇంత మార్పా?
బీఆర్ఎస్ రాష్ట్రానికే పరిమితమయింది. జాతీయ పార్టీ అని చెపుకుంటూ తిరిగిన ఆ పార్టీ ఇప్పుడు ఇతర రాష్ట్రాల వైపు చూడటం లేదు
తొమ్మిదేళ్లు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన గులాబీ పార్టీ జాతీయ పార్టీగా అవతరించింది. అయితే గత ఎన్నికల ఫలితాలతో డీలా పడింది. జాతీయ పార్టీ మాట దేముడెరుగు.. సొంత రాష్ట్రంలో మనుగడ కోసం ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుందంటే ఎంతలో ఎంత డీలా పడిపోయింది? అని ప్రత్యేకంగా వేరే చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన ఉద్యమ సంస్థగా తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటయింది. టీఆర్ఎస్ గా తెలంగాణ ప్రజల నోళ్లలో నానింది. కారు గుర్తును ఒకటి కాదు.. రెండు సార్లు గెలిపించి కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేశారు జనం. తెలంగాణ రాష్ట్రం ఆయన వల్లనే సాధ్యమయిందన్న నమ్మకంతోనే జనం గులాబీ పార్టీ వైపు మొగ్గుచూపారు.
పేరు మార్చి...
కానీ ఎవరు చెప్పారో.. తెలీదు.. పేరు మారిస్తే మూడోసారి విజయం ఖాయమని చెప్పారేమో కూడా తెలియదు. కేసీఆర్ మస్కిష్కంలో పుట్టిన ఆలోచన అని కూడా చెప్పలేం. ఇలా కారణాలేవైనా టీఆర్ఎస్ ను ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ గా మార్చి పడేశాడు పెద్దాయన. తనను తప్ప మరెవ్వరినీ ప్రజలు ఆదరించరన్న ధైర్యం కావచ్చు. అందుకే టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా తీర్చాలని, దేశాన్ని ఉద్దరించాలని కారు వేసుకుని బయలుదేరారు సారు. ప్రధానంగా ఒడిశా, మహారాష్ట్రలపైనే ఆయన ఎక్కువ దృష్టి పెట్టారు. తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలపైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లలో పార్టీ బలోపేతానికి పెద్దగా ప్రయత్నించలేదనే చెప్పాల్సి ఉంటుంది.
ఓటమి తర్వాత...
అయితే మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలయింది. ఆ తర్వాత పరిస్థితులు వేగంగా మారాయి. గతంలో పొత్తుల ఊసే ఎత్తని కేసీఆర్ ఈసారి తెలంగాణలో ఎక్కువ స్థానాలను సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కమ్యునిస్టులతో ఉప ఎన్నికల్లో పొత్తును పెట్టుకున్న కేసీఆర్ సాధారణ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగారు. గేరు మార్చుదామనుకున్న గులాబీ బాస్ కు ఫస్ట్ గేర్ నుంచి ముందుకు పడలేదు. దీంతో కేసీఆర్ అధికారానికి దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఆయన బీఆర్ఎస్ ను ఏ ఏ రాష్ట్రాల్లో పోట ీచేయించాలన్న దానిపై ఇంత వరకూ స్పష్టత రాలేదు. మహారాష్ట్రలో చాలా సభలు పెట్టి హడావిడి చేసిన కేసీఆర్ ఫలితాల తర్వాత అటువైపు చూడటం మానేశారు.
ఇతర రాష్ట్రాల నేతలు...
దీంతో కేసీఆర్ కు మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. తాము పోటీ చేయాలా? వద్దా? చెప్పాలంటూ వారు అల్టిమేటం ఇస్తున్నారు. బీఆర్ఎస్ వద్ద నిధులు పుష్కలంగా ఉన్నాయి. నిధుల కొరత లేకపోవడంతో పోటీ చేసి తాము కూడా రాజకీయాల్లో సత్తా చాటాలని భావించి అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో చేరిన నేతలు ఇప్పుడు డైలమాలో పడ్డారు. ఒడిశా బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతలందరూ రాజీనామా చేసేశారు. ఏపీలోనూ అంతే పరిస్థితి. ఇక మహారాష్ట్రలో కూడా తమ సంగతి ఏందో చెప్పాలంటూ నిలదీయడం ప్రారంభమయింది. మరి జాతీయ పార్టీగా ప్రకటించుకున్న కేసీఆర్ ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఏ ఏ రాష్ట్రాల్లో పోటీ చేస్తారు? కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితమవుతారా? అన్నది మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.
Next Story