Thu Dec 19 2024 15:50:02 GMT+0000 (Coordinated Universal Time)
Kalvakuntla Kavitha : కవిత అరెస్ట్ సానుభూతి తెస్తుందా? లేక నెగిటివ్ ను తెచ్చిపెడుతుందా?
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టయి తీహార్ జైలులో ఉన్నారు. ఆమెకు పదిహేను రోజులు న్యాయస్థానం రిమాండ్ విధించింది
Kalvakuntla Kavitha :బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టయి తీహార్ జైలులో ఉన్నారు. ఆమెకు పదిహేను రోజులు న్యాయస్థానం రిమాండ్ విధించింది. కల్వకుంట్ల కుటుంబంలో తొలి సారి కవిత అవినీతి కేసులో జైలుకెళ్లారు. ఉద్యమం సమయంలో వెళ్లడం వేరు. అవినీతి కేసులో జైలు ఊచలు లెక్కపెట్టడం వేరు. అందుకే కవిత అరెస్ట్ పై ప్రజల్లో అభిప్రాయం ఏ మేరకు ఉందన్నది బీఆర్ఎస్ నేతలకు అర్థం కాకుండా ఉంది. మార్చి 15వ తేదీన కవితను బంజారాహిల్స్ లోని తన నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. ఆ మరుసటి రోజు బీఆర్ఎస్ శ్రేణులు కొంత ఆందోళన చేశాయి. కానీ ఆ తర్వత కవిత అరెస్ట్ పై ఎలాంటి ఆందోళనలు బీఆర్ఎస్ చేయలేదంటేనే అర్థం చేసుకోవచ్చు.
లిక్కర్ స్కామ్ లో...
కల్వకుంట్ల కవిత అరెస్టయింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో. మహిళ అయి ఉండి ఆమె లిక్కర్ స్కామ్ కేసులో ఇరుక్కోవడంపై తెలంగాణ సమాజం కూడా పెద్దగా సానుభూతి చూపించడం లేదన్నది అర్థమవుతుంది. లిక్కర్ వ్యాపారులతో మీటింగ్ లు పెట్టడం కాకుండా, వందల కోట్లు వసూలు చేసి ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వానికి కవిత అందచేశారని, సౌత్ వ్యాపారుల నుంచి ముడుపులు వసూలు చేసింది కవిత అని, ఆమె సెల్ఫోన్లను కూడా ధ్వంసంచేశారంటూ ఈడీ అనేక ఆరోపణలు చేయడంతో తెలంగాణ ప్రజలు కవిత అరెస్ట్.. జైలుకు వెళ్లిన పరిస్థితిని పెద్దగా పట్టించుకోవడం లేదు. అందుకే ఆమె అరెస్టయినా ఆ పార్టీ నేతల నుంచే పెద్దగా సానుభూతి వ్యక్తం కాలేదంటున్నారు.
పార్లమెంటు ఎన్నికలలో...
కల్వకుంట్ల కవిత అరెస్ట్ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రభావం చూపుతుందా? అన్న కోణంలోనూ పార్టీలో మొన్నటి వరకూ చర్చ జరిగింది. అయితే అలాంటిదేమీ లేదన్న సంకేతాలు గ్రామస్థాయి నుంచి అందుతున్నాయి. ఫీడ్ బ్యాక్ అంతా నెగిటివ్ వస్తుండటంతోనే కవిత అరెస్ట్ పై ఎవరూ పెదవి విప్పడం లేదని, ఆందోళనలకు దిగడం లేదని అంటున్నారు. సహజంగా ఒక మహిళను అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుంది. కానీ కవిత విషయంలో అందుకు విరుద్ధంగా పరిస్థితి కనిపిస్తుందని అంటున్నారు. అందుకే కవిత తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా కవిత అరెస్ట్ పై ఏమాత్రం ప్రకటన చేయలేదని కూడా చెబుతున్నారు.
ప్రస్తావించకపోవడమే...
రానున్న పార్లమెంటు ఎన్నికలు బీఆర్ఎస్ కు కీలకం. ఇప్పటికే అనేక మంది నేతలు కాంగ్రెస్, బీజేపీల వైపు క్యూ కడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తోనే ఈ పరిస్థితి ఉంటే.. పార్లమెంటు ఎన్నికల్లో తక్కువ స్థానాలు వస్తే నేతలు మిగులుతారా? అన్న ఆందోళన ఆ పార్టీ అగ్రనేతల్లో నెలకొంది. అందుకే తమకు కలసి రాని కవిత అరెస్ట్ విషయాన్ని ప్రస్తావించకపోవడమే మంచిదని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. కవిత తన అరెస్ట్ అక్రమమని ఎంత చెబుతున్నప్పటికీ కేజ్రీవాల్ ను కూడా ఇదే కేసులో అరెస్ట్ చేయడంతో ఆ కామెంట్స్ ప్రభావం పెద్దగా పనిచేయడం లేదంటున్నారు. సో..కవిత అరెస్ట్ సెంటిమెంట్.. పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం పనిచేయదన్న నిర్ణయానికి ఆ పార్టీ అధినాయకత్వమే వచ్చిందని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. సానుభూతి లేకపోతే సరి.. నెగిటివ్ తెచ్చిపెట్టకుండా ఉంటే అదే పదివేలు అని అనుకుంటున్నారు.
Next Story