Fri Dec 20 2024 06:18:44 GMT+0000 (Coordinated Universal Time)
BRS : అదృష్టమంటే నీదేనయ్యా.. పిలిచి పదవులిస్తున్నారు.. ఇదేమి రాజకీయమయ్యా?
రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు మరోసారి పార్టీ మారేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయ్యారు
రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు.. తొలుత జర్నలిస్టు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ లో సుదీర్ఘకాలం సాగింది. పలు పదవులు అప్పుడు కూడా పొందారు. సామాజికవర్గం కోణంలో ఆయనకు అప్పుడూ.. ఇప్పుడూ.. ఎప్పుడూ పదవులు దక్కుతూ వచ్చాయి. అదృష్టం అలా అంటి పెట్టుకుని ఉండటంతో ఆయన ఏదో ఒకపదవిలో కొనసాగుతూనే వస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన కేశవరావు స్వతహాగా జర్నలిస్ట్ కావడంతో జనం పల్స్ ముందుగానే అంచనా వేసుకని నాటి టీఆర్ఎస్ లో చేరారు. కేసీఆర్ కూడా కేకేకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. పార్టీలో ఉన్నతమైన స్థానాన్ని కల్పించారు.
రెండు సార్లు రాజ్యసభకు...
పదేళ్ల పాటు టీఆర్ఎస్ లో ఉన్న కె. కేశవరావు రెండు సార్లు రాజ్యసభ స్థానాన్ని దక్కించుకున్నారు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. మ్యానిఫేస్టో కమిటీ నుంచి పార్టీలో ప్రధాన బాధ్యతలను కూడా కేశవరావుకు కేసీఆర్ అప్పగించారు. పార్టీలో సెక్రటరీ జనరల్ ను చేశారు. రాజ్యసభలో బీఆర్ఎస్ పక్ష నేతగా కూడా వ్యవహరించారు. అలా అన్ని రకాలుగా కేసీఆర్ కేకేను అందలం ఎక్కించారు. అంతేకాదు జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగితే ఆయన కుమార్తె విజయలక్ష్మికి మేయర్ గా నియమించారు. ఒకే కుటుంబానికి ఇన్ని పదవులా? అని పార్టీలో కొందరు నేతలు నెత్తీ నోరు మొత్తుకున్నా కేసీఆర్ మాత్రం కేకే పక్షాన మాత్రమే నిలిచారు. ఆయనంటే అంత నమ్మకం మరి.
కాంగ్రెస్ లో చేరేందుకు...
అలాంటి కేకే ఇప్పుడు మరోసారి జంప్ కు సిద్ధమయ్యారన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఆయన ఇంటికి ఏఐసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ వచ్చి పార్టీలో చేరాలని ఆహ్వానించడంతో ఆయన అందుకు అంగీకరించినట్లు చెబుతున్నారు. కుమార్తెతో పాటు తాను కూడా కాంగ్రెస్ గూటికి చేరేందుకు కేకే సామాను సర్దుకుంటున్నట్లు చెబుతున్నారు. అయితే తనకు రెండు సార్లు రాజ్యసభ కు అవకాశం కల్పించిన కేసీఆర్ కు చెప్పకుండా పార్టీ మారడం బాగోదు అనుకున్నారో? ఏమో ఎర్రవెల్లి ఫాం హౌస్ కు వెళ్లి మరీ కలిశారు. అయితే కేసీఆర్ కేకేపై అసహనం వ్యక్తంచేసినట్లు చెబుతున్నారు. పదేళ్ల పాటు పదవులు అనుభవించి అధికారం కోల్పోయిన వెంటనే వెళతారా? అని కేసీఆర్ ప్రశ్నించినట్లు సమాచారం.
సాకులు చెప్పవద్దంటూ...
దీంతో కేకే ఏదో చెప్పబోతుండగా సాకులు చెప్పవద్దంటూ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో కేకే ఎర్రవెల్లి ఫాం హౌస్ నుంచి బయటకు వచ్చేశారన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. కేకే ఈ నెల 30వ తేదీన బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరాలని ముహూర్తం కూడా నిర్ణయించుకున్న తర్వాతనే కేసీఆర్ కు చెప్పి వెళదామని అక్కడకు వెళ్లారని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే కేకే కుటుంబ సభ్యులు కొన్ని స్థల వివాదాల్లో చిక్కుకున్నందునే దాని నుంచి బయట పడేందుకే కాంగ్రెస్ లో చేరుతున్నారని కూడా అంటున్నారు. మొత్తం మీద రాజకీయాల్లో నమ్మకం.. సిద్ధాంతాలు.. నడవడిక.. వంటి పదాలకు అర్థం లేకుండా పోయిందంటున్నారు. అదే కేకే రేపు మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అందులోకి కూడా సులువుగా చేరిపోతారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. మరి కేకే చేరతారా? లేదా? అన్నది మరో రెండు రోజుల్లో తెలియనుంది.
Next Story