Fri Dec 27 2024 06:12:54 GMT+0000 (Coordinated Universal Time)
KTR : కేటీఆర్ ఆ పనిచేస్తే ఇక అంతే.. మళ్లీ పార్టీ మొదటికొచ్చినట్లేనా?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఆయన మల్కాజ్గిరి లేదా సికింద్రాబాద్ నుంచి పోటీ చేయవచ్చని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే కేటీఆర్కు అత్యంత సన్నిహితులైన వారు మాత్రం దీనిని ప్రచారంగానే కొట్టిపారేస్తున్నారు. తెలంగాణను వదిలి ఢిల్లీకి వెళ్లే ఆలోచన కేటీఆర్ ఎందుకు చేస్తారన్న ప్రశ్న వేస్తున్నారు. నిజమే.. కేటీఆర్ కు ఎంపీగా పోటీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు ఒక అవకాశం వచ్చింది కదా? అన్న కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో బలంగా వినపడుతున్నాయి.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడే...
నాయకుడు అనే వారు అధికారంలో ఉన్నప్పటి కంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రాటుదేలతాడట. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అన్ని విషయాలపై సమగ్ర అవగాహన ఏర్పరచుకోవడమే కాకుండా ప్రజల్లో హైలెట్ అవ్వడానికి కూడా ఒక అరుదైన అవకాశంగా రాజకీయ నేతలు భావిస్తారు. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఆ పార్టీ అధికారంలోనే ఉంది. అంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అప్పట్లో కేటీఆర్ అంత ఫోకస్ కాలేదు. ఎక్కువగా హరీశ్ రావు, ఈటల రాజేందర్లు మాత్రమే అప్పట్లో ఎక్కువగా కనిపించే వారు. వినిపించే వారు. తర్వాత పదేళ్ల పాటు కేటీఆర్ మంత్రిగా ఉండి అందులోనూ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలను చేపట్టి పలువురు అభిమానులను ఆయన సంపాదించుకున్నారు.
కేసీఆర్ మాత్రం...
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశముంది. సహజంగా పదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ అసెంబ్లీకి ప్రతిపక్ష నేతగా రాలేకపోవచ్చు. అందులోనూ తాను తీవ్రంగా వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి తన స్థానంలో కూర్చుని ఉండటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోవచ్చు. అందుకే కేసీఆర్ మెదక్ లేదా మరో పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసే అవకాశముంది. అయితే కేటీఆర్ ఎందుకు పోటీ చేస్తారన్న ప్రశ్నకు మాత్రం ఎవరి వద్దా సమాధానం లేదు. ఇప్పటికీ తెలంగాణలో బీఆర్ఎస్ కు బేస్ ఉంది. పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకున్నంత మాత్రాన ఏమీ జరగదు. అందుకోసం తాను సిరిసిల్ల నియోజకవర్గం శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి మరీ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తారనుకోవడం భ్రమేనంటున్నారు పార్టీ శ్రేణులు. ఉబుసుపోక కొందరు ప్రచారం చేస్తున్నారంటున్నారు.
ఇక్కడే ఉండి...
అసెంబ్లీలో కేసీఆర్ తర్వాత కేటీఆర్ ఉండి పార్టీని నడిపించాలి. రాష్ట్రంలో ఉండి వచ్చే ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయాల్సిన బాధ్యత కూడా కేటీఆర్ పైనే ఉంది. కేటీఆర్ కు ఇదొక చక్కటి అవకాశం. నాయకుడిగానే కాదు... వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించుకుని నేరుగా ముఖ్యమంత్రి పదవిని దక్కించుకునే అవకాశం ఆయనకు దొరకబోతుంది. అలాంటిది కాదనుకుని ఢిల్లీ వెళ్లడానికి ఎందుకు ప్రయత్నిస్తారన్న సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. కేటీఆర్, హరీశ్ రావులు అసెంబ్లీలోనే ఉండి ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు పర్చేంత వరకూ, ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజాక్షేత్రంలో పోరాడేందుకు శ్రేణులను సమాయత్తం చేయాల్సిన బాధ్యత కూడా కేటీఆర్ పై ఉండగా ఆయనెందుకు ఆ నిర్ణయం తీసుకుంటారన్న చర్చ పార్టీలో జరుగుతుంది.
Next Story