Fri Nov 22 2024 14:55:00 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఆర్కే రాజీనామా కూడా ఆమోదిస్తారా.. ఆయనతో టు మరికొందరిపైనా వేటు?
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాను కూడా స్పీకర్ ఆమోదించే అవకాశాలు కనిపిస్తున్నాయి
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాను కూడా స్పీకర్ ఆమోదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఆళ్ల వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దీంతో ఆయన రాజీనామాను కూడా త్వరలో స్పీకర్ ఆమోదించే అవకాశాలున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.మంగళగిరి నియోజకవర్గం ఇన్ఛార్జిగా గంజి చిరంజీవిని వైఎస్ జగన్ నియమించడంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన స్వయంగా వెళ్లి రాజీనామా లేఖ ఇచ్చి వచ్చారు. అయితే ఆయన ఇటీవల కాంగ్రెస్ లో చేరడంతో ఆయన రాజీనామాను ఆమోదించాలని పార్టీ అధినాయకత్వం కూడా స్పీకర్ ను కోరనుంది.
కాంగ్రెస్ లో చేరడంతో...
త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో మళ్లీ క్రాస్ ఓటింగ్ జరగకుండా ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాను ఆమోదించితే ఇటు గంటాతో పాటు అటు ఆళ్ల రాజీనామాను కూడా ఆమోదించినట్లవుతుందని దీనివల్ల బయట నుంచి విమర్శలు పెద్దగా రావని పార్టీ అధినాయకత్వం భావిస్తుంది. తాజాగా జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుకు కూడా నోటీసులు స్పీకర్ కార్యాలయం నుంచి అందినట్లు తెలిసింది. వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని కోరినట్లు చెబుతున్నారు. త్వరలోనే ఏపీలో మూడు రాజ్యసభ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. నిజానికి వైసీపీకి తగినంత బలముంది. మూడు రాజ్యసభ స్థానాలు వైసీపీకే దక్కనున్నాయి. 151 స్థానాలున్న వైసీపీకే మూడు స్థానాలు అంకెలు పరంగా చూస్తే మాత్రం దక్కాల్సి ఉంది. అయితే జరుగుతున్న రాజకీయ పరిణామాలతో వైసీపీ హైకమాండ్ అలర్ట్ అయింది.
ఎమ్మెల్యేలలో అసంతృప్తితో...
పార్టీ ఇన్ఛార్జుల మార్పులతో నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కొంత అసంతృప్తి ఉంది. అందుకే టీడీపీని మరింత బలహీన పర్చాలని వైసీపీ అధినాయకత్వం భావిస్తుంది. అందులో భాగంగానే రెండేళ్ల క్రితం గంటా శ్రీనివాసరావు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం చేసిన రాజీనామాకు ఇప్పుడు మోక్షం కలిగిందంటున్నారు. దీంతో వైసీపీ బలం అధికారికంగా 23 అయినా అనధికారికంగా 22కు చేరినట్లయింది. మరో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు తమకు మద్దతుగా నిలుస్తారు. అంటే టీడీపీ బలం 18కి పడిపోయినట్లే. అందుకే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ముందుగా ఆమోదించారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఆ నలుగురు...
ఆర్కే రాజీనామాతో పాటు నలుగురు వైసీీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేయనున్నట్లు తెలిసింది. వైసీపీ నుంచి గత ఎన్నికల్లో గెలిచి గత కొంతకాలం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ లైన్ ను దాటి క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారన్న కారణంతో ఆ నలుగురి శాసనసభ్యత్వాలను రద్దు చేసే అవకాశాలున్నాయి. ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలపై అనర్హత వేటు వేస్తే వారు రాజ్యసభ ఎన్నికల్లో ఓటింగ్ కు దూరమయ్యే అవకాశాలున్నాయని అంచనా వేస్తుంది. దీంతో టీడీపీ కూడా అప్రమత్తమయింది. తమ పార్టీ నుంచి గెలిచి వైసీపీకి మద్దతుదారులుగా నిలిచిన నలుగురు ఎమ్మెల్యేలపై కూడా వేటు వేయాలని టీడీపీ వత్తిడి తేవడానికి సిద్ధమయింది. మొత్తం మీద ఏపీలో రాజ్యసభ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో చాలా మంది ఎమ్మెల్యేలపై వేటు పడే అవకాశముందని చెబుతున్నారు.
Next Story