Mon Dec 23 2024 08:19:10 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీకి 175 సీట్లు ఎందుకు రాకూడదన్న వైఎస్ జగన్ వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్..!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి కాళ్ల కింద..
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల వైసీపీ నేతలతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొత్తం 175 సీట్లుంటే వాటన్నింటిలోనూ వైసీపీ ఎందుకు గెలవకూడదని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రతి ఎమ్మెల్యే నెలకు 10 సచివాలయాలు తిరగాలి. గత ఎన్నికల్లో 151 సీట్లు గెలిచాం. వచ్చే ఎన్నికల్లో ఈ సీట్ల సంఖ్య తగ్గకూడదు. అసలు 175కి 175 సీట్లు ఎందుకు గెలవకూడదు? అని జగన్ వ్యాఖ్యలు చేసారు. పార్టీకి చెందిన గ్రాఫ్‌ను మొత్తం 100 శాతం అనుకుంటే అందులో తన పనితీరుకు గ్రాఫ్ 60 శాతమని తెలిపారు జగన్. తన గ్రాఫ్ బాగానే ఉందని.. మిగిలిన 40 శాతం గ్రాఫ్ పార్టీ నేతలదేనని వైఎస్ జగన్ తెలిపారు.
ఈ వ్యాఖ్యలపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు స్పందించారు. అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జులు, మండల పార్టీ అధ్యక్షులతో గురువారం నిర్వహించిన ఆన్లైన్ సమావేశంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి కాళ్ల కింద నేల కదులుతోందని.. దానిని కప్పిపుచ్చుకోవడానికి ఈసారి తనకు 175 సీట్లు ఎందుకు రావని మాట్లాడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. వైసీపీకి సింగిల్ డిజిట్ సీట్లు వస్తే గొప్పేనని అన్నారు. నెత్తిన పెట్టుకొన్న ఈ కుంపటిని ఎప్పుడు దించుదామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని చంద్రబాబు కౌంటర్ వేశారు.
టీడీపీ చేపడుతున్న ప్రజాందోళనలకు వస్తున్న స్పందన, ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత చూసి జగన్‌కు భయం పట్టుకొందని అన్నారు చంద్రబాబు. ఏం సాధించాడని ప్రజలు 175 సీట్లు ఇస్తారు? జగన్ బాదుళ్లకు మెచ్చి ఇస్తారా? అని ప్రశ్నించారు. విద్య, వైద్యం, సాగునీరు, వ్యవసాయం సహా ఏ రంగంలో అయినా అప్పటి పరిస్థితి ఏమిటో.. ఇప్పటి పరిస్థితి ఏమిటో చర్చకు తాము సిద్ధమని చంద్రబాబు అన్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్.తులసిరెడ్డి సీఎం జగన్ వ్యాఖ్యలపై సెటైర్లు విసిరారు. పులివెందులలో జగన్‌ను ఎందుకు ఓడించకూడదో సమాధానం చెప్పాలని, రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలకుగాను 175 వైసీపీకి ఎందుకు రావు? అని సీఎం జగన్ ప్రశ్నించడం హాస్యాస్పదమని అన్నారు.
Next Story