Sun Nov 24 2024 18:25:37 GMT+0000 (Coordinated Universal Time)
Janasena : క్రౌడ్ పుల్లర్కు ఆ మాత్రం ఛాన్స్ ఇవ్వరా? ఇవేమి మాటలు?
ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు జనసేన పార్టీలో ఒకరకంగా అసంతృప్తికి గురిచేశాయనే చెప్పాలి
జనసేన అధినేత ఇతర రాజకీయ నేతల్లా కాదు. పవన్ కల్యాణ్ వస్తున్నారంటే జనం పోటెత్తుతారు. పవన్ చూసేందుకు వేలాది మంది స్వచ్ఛందంగా తరలివస్తారు. టీడీపీతో పాటు ఇతర రాజకీయ పార్టీల మాదిరిగా జనాన్ని తరలించేందుకు ఎలాంటి ఖర్చు చేయాల్సిన పనిలేదు. అందుకే ఏపీ పాలిటిక్స్ లో పవన్ కల్యాణ్ ను క్రౌడ్ పుల్లర్ గా భావిస్తారు. అయితే ఆయన ముఖ్యమంత్రి కావాలని జనసైనికులు అందరూ బలంగా కోరుకుంటున్నారు. జనసైనికులు, పవన్ అభిమానులు మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ లో బలమైన సామాజికవర్గం కాపులు కూడా అదే ఆకాంక్షను బహిరంగంగా వెలిబుచ్చుతున్నారు. అందులో ఎలాంటి తప్పులేదు. తమ నేత ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం నేరం కాదు. అసలైన.. సిసలైన జనసైనికులు అదే కోరుకుంటారు. అందులో తప్పుపట్టాల్సిన పనిలేదు.
లోకేష్ వ్యాఖ్యలపై...
అయితే ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు జనసేన పార్టీలో ఒకరకంగా అసంతృప్తికి గురిచేశాయనే చెప్పాలి. ఎన్నికలకు జరగానికి ముందుగానే ఆయన అటువంటి ప్రకటన చేయడంపై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ ను అభిమానించే వారు ఎవరైనా నారా లోకేష్ మాటలకు హర్ట్ అవ్వడం కామన్. అది సహజంగా మనసులో నుంచి ఉబికి వచ్చే స్పందన మాత్రమే. అయితే నారా లోకేష్ ఈ విషయంలో తొందరపడ్డారనే భావించాల్సి ఉంటుంది. టీడీపీ, జనసేన కూటమి గెలిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని నారా లోకేష్ ప్రకటించడాన్ని జనసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ఏపీ రాజకీయాల్లో సంచలనానికి కారణమయింది. పొత్తు ధర్మం పాటించే వారెవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అన్న కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వినపడుతున్నాయి.
సరైన సమయంలో...
నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై జనసేనాని పవన్ కల్యాణ్ ఇంత వరకూ స్పందించలేదు. ఆయన సంయమనం పాటిస్తున్నారు. మొన్నటి వరకూ టీడీపీ బలమెంత? పొత్తు కుదిరిన తర్వాత వచ్చిన హైప్ ఎంత? అన్నది ఒక్కసారి నారా లోకేష్ ఆలోచించుకుంటే మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి. జనసేనతో పొత్తు కుదిరిన తర్వాతనే జరిగిన సర్వేల్లో టీడీపీ, జనసేన కూటమి బలం పెరిగిందని తెలిసింది. అది చూసి తమ ప్రతిభ అని భావించడం ఎంతవరకూ సబబన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం పోటీ చేసేందుకు కూడా టీడీపీ నుంచి ఎవరూ ముందుకు రాని విషయాన్ని జనసైనికులు గుర్తు చేస్తున్నారు. చివరకు యువగళం ముగింపు సభ విజయవంతం అయిందంటే అందుకు కారణం పవన్ కల్యాణ్ కాదా? అని వారు ప్రశ్నిస్తున్నారు.
పొత్తు సుదీర్ఘకాలం ఉండాలంటే?
అయితే నారా లోకేష్ వ్యాఖ్యలపై జనసేనాని త్వరలోనే స్పందిస్తారని తెలిసింది. సరైన సమయంలో ఆయన స్పందన ఉంటుందని జనసైనికులు భావిస్తున్నారు. పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీతో పొత్తు పెట్టుకున్నారన్న విషయాన్ని విస్మరించరాదని జనసైనికులు కోరుకుంటున్నారు. ఇప్పుడు అధికారం అవసరం పవన్ కంటే టీడీపీకే అత్యవసరమని వారు అభిప్రాయపడుతున్నారు. అలాంటి సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసి తమ మనోభావాలు దెబ్బతీయడం సరికాదన్నది జనసైనికుల మనోగతంగా ఉంది. పొత్తు కొన్నేళ్ల పాటు కొనసాగాలని పవన్ కల్యాణ్ కోరుకున్నారంటే ఆయన ఎంతగా రాష్ట్రాభివృద్ధి కోసం పరితపిస్తున్నారో అర్థం చేసుకోవడం మంచిదంటున్నారు. ఎస్సి, బీసీ, మైనారిటీ, బలిల, కాపు, తెలగ, తూర్పు కాపులు, అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనకబడిన వారి అభ్యున్నతే పవన్ అజెండా అని వారు చెబుతున్నారు. అందుకే మాట్లాడే సమయంలో ఆచితూచి మాట్లాడటం మంచిదన్న హితవు రెండు పార్టీల పొత్తును కోరుకునే శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.
Next Story