Thu Dec 19 2024 19:12:54 GMT+0000 (Coordinated Universal Time)
Congress : ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నదే టాపిక్... రేసులో వీరు
కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న దానిపై చర్చ జరుగుతుంది
కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. సుదీర్ఘకాలం తర్వాత ఎదురు చూసి ఎదురు చూసిన నేతలకు ఇప్పుడు హ్యాపీ న్యూస్ అనే చెప్పాలి. పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు. అది అలా ఉంచితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దానిపై చర్చ ఒకవైపు జరుగుతుంటే...ఇంతకీ ముఖ్యమంత్రి ఎవరు అవుతారన్న దానిపై టాపిక్ మళ్లింది. బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. కానీ కాంగ్రెస్ లో అలా కాదు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఫలానా నేత అని ముందుగా ఎవరూ చెప్పలేరు. అధినాయకత్వం నిర్ణయించాలి. అన్నీ ఆలోచించి హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని ఇక్కడ ఎమ్మెల్యేలు ఆమోదించాల్సి ఉంటుంది.
రేవంత్ పేరు...
సహజంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేరు ముఖ్యమంత్రి రేసులో ముందుంటుంది. ఎందుకంటే పార్టీని అధికారంలోకి తేవడంలో ఆయన పడిన శ్రమ అంతా ఇంతా కాదు. అసలు రేవంత్ రెడ్డి కారణంతోనే కాంగ్రెస్ కు హైప్ వచ్చింది. తర్వాత అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచారం వరకూ సరైన చర్యలు తీసుకోని ఉండవచ్చు కానీ.. రేవంత్ ను ఇప్పుడు హైకమాండ్ సీఎం చేస్తుందా? లేదా? అన్నదే చర్చనీయాంశంగా మారింది. కర్ణాటకలోనూ డీకే శివకుమార్ ఆర్థికంగా, అన్ని రకాలుగా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినా అక్కడ సిద్ధరామయ్యను కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యమంత్రి పదవి పై కూర్చోబెట్టింది. డీకే శివకుమార్ ను డిప్యూటీ సీఎంగా మాత్రమే చేసి సర్ది చెప్పగలిగింది.
రెడ్డి సామాజికవర్గంలో...
ఇక కాంగ్రెస్ అన్ని రకాలుగా సమీకరణలు చేయాల్సి ఉంటుంది. రేవంత్ రెడ్డి సామాజికవర్గం పరంగా చూస్తే చాలా మంది అదే సామాజికవర్గం నుంచి ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్నారు. రేవంత్ రెడ్డి తో పాటు మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తో పాటు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు కూడా బలంగా వినిపిస్తుంది. వీరంతా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే పీసీసీ చీఫ్ గా రెండు దఫాలు చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పార్టీని నమ్ముకుని ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అంటే పార్టీ పట్ల విధేయతను ప్రదర్శిస్తూనే వస్తున్నారు. రెడ్డి సామాజికవర్గానికి ఇచ్చే పనైతే రేవంత్ పేరు ప్రముఖంగానే వినిపించవచ్చు.
లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంటే...
కానీ ఎస్.సి లను ఎంపిక చేయదలచుకుంటే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేరు ప్రముఖంగా ముఖ్యమంత్రి రేసులో ముందుంది. ఆయన పేరు ఖరారయితే ఎవరూ అభ్యంతరు చెప్పరన్న భావన పార్టీలో ఉంది. అందుకే భట్టి విక్రమార్క పేరును కూడా తేలిగ్గా కొట్టిపారేయలేని పరిస్థితి. ఆయన తెలంగాణలో పాదయాత్ర చేసి మరీ పార్టీని నిలబెట్టారని కూడా హైకమాండ్ భావించే అవకాశముంది. దీంతో పాటు వచ్చే లోక్సభ స్థానాలు కాంగ్రెస్ కు ముఖ్యం కాబట్టి ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మల్లు భట్టి విక్రమార్కను ముఖ్యమంత్రిగా చేసే ఛాన్స్ ఉందంటున్నారు. వీరితో పాటు గిరిజన మహిళలకు ఒక అవకాశమిస్తే తప్పేమిటన్నది కూడా ఉంది. ఆమెకు రేవంత్ రెడ్డి అండగా ఉండటం కూడా అదనపు బలం అవుతుంది. మొత్తం మీద కాంగ్రెెస్ ముఖ్యమంత్రి ఎవరు అన్నది తేలాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
Next Story