ఈ సారి తెలంగాణ 'హస్త'గతం అవుతుందా?
ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది తెలంగాణలో రాజకీయాలు వేడిని పుట్టిస్తున్నాయి. ఓ వైపు నుంచి యాక్షన్ వస్తే.. మరోవైపు నుండి రియాక్షన్
ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది తెలంగాణలో రాజకీయాలు వేడిని పుట్టిస్తున్నాయి. ఓ వైపు నుంచి యాక్షన్ వస్తే.. మరోవైపు నుండి రియాక్షన్ వచ్చేస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలకు ప్రతివ్యూహాలు సంధించే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. కర్ణాటకలో కాంగ్రెస్ జెండా ఎగరడం వంటి పరిణామాలు తెలంగాణలోనూ ఇంట్రెస్టింగ్గా మారాయి. కర్ణాటక ఫలితాలు.. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుపై ఆశలు చిగురించేలా చేశాయి. మరోవైపు పార్టీ మారాలనుకుంటున్న నాయకులు కూడా ఓ అంచనాకు వస్తున్నారు. ప్రస్తుత రాజకీయ సమీకరణాలను పరిశీలిస్తే.. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ను ఢీకొట్టే దమ్ము దక్షిణాదిలో ఎప్పటి నుంచో విస్తరించాలనుకుంటున్న బీజేపీ కన్నా కాంగ్రెస్‌కే ఎక్కువగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇందుకు పరిస్థితులు కూడా ప్రస్తుతం అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోంది.
ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే ప్రజాదారణ ఉన్న నేతలను రంగంలోకి దింపాల్సి ఉంటుంది. అలాంటప్పుడే నాయకత్వ లేమితో ఇబ్బంది పడుతున్న బీజేపీని, సెంటిమెంట్ నిర్మించబడిన బీఆర్ఎస్ను కాంగ్రెస్ ఢీకొట్టే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ అగ్రనేతలు సైతం రాష్ట్రంలోని పలు కీలక అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎన్నికల ప్రచారం, వ్యూహరచన వంటి కార్యాచరణ.. స్థానికంగా ఆమోదించబడిన నాయకత్వంతోనే సిద్ధం చేయాలి. అన్నికంటే ముఖ్యం.. పార్టీ నేతల ఐక్యత. పార్టీలోని నాయకులు ఐక్యంగా ఉంటే బీఆర్ఎస్కు కాంగ్రెస్ బలమైన ప్రత్యామ్నాయంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహాం లేదు.
అధికార పార్టీపై ఉండే వ్యతిరేకతను క్యాష్ చేసుకునే విషయంలో బీజేపీ కంటే.. కాంగ్రెస్ చాలా అలర్ట్‌గా ఉంటేనే అనుకున్నది.. అనుకున్నట్లు జరుగుతుంది. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ఓటర్లు మార్పు కోరుకుంటే మాత్రం.. రెండు జాతీయ పార్టీల్లో ఏదో ఒక దానివైపు మొగ్గు చూపుతారు. ముఖ్యంగా కాంగ్రెస్‌కే తెలంగాణ ప్రజలు జై కొట్టే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధి నాయకత్వం పరిణగలోకి తీసుకుని వ్యూహాలు రచించాల్సి ఉంటుంది. అప్పుడే తెలంగాణ హస్తగతం అవుతుంది.