Mon Dec 23 2024 19:30:06 GMT+0000 (Coordinated Universal Time)
బాల్కసుమన్ పై జగ్గారెడ్డి ఫైర్ - ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలి !
పోలీసులు ఉంటే నిన్నెవరూ ఏమీ చేయలేరనుకుంటున్నావేమో. యూత్ కాంగ్రెస్ వాళ్లు వెంటాడితే నువ్వు తిరగలేవు. బాల్క సుమన్..
హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఇటీవల కాంగ్రెస్ నాయకత్వంపై వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మండిపడ్డారు. గల్లీలో గోలీలు ఆడుకునే బాల్కసుమన్ ఎంపీ అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాడని.. ఒక్కసారి ఓడిపోతే కనుమరుగైపోతాడని హెచ్చరించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. "బాల్క సుమన్... నీకు రాహుల్ గాంధీ మీద వ్యాఖ్యలు చేసేంత దమ్ముందా? నువ్వెంత, నీ బతుకెంత? రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలంటావా? రాహుల్ గాంధీ కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకున్నా తప్పులేదు" అంటూ జగ్గారెడ్డి నిప్పులు చెరిగారు.
"పోలీసులు ఉంటే నిన్నెవరూ ఏమీ చేయలేరనుకుంటున్నావేమో. యూత్ కాంగ్రెస్ వాళ్లు వెంటాడితే నువ్వు తిరగలేవు. బాల్క సుమన్.. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలి.. పోలీసులు ఎంతసేపు ఉంటారు? ఎవరో ఒకరు వచ్చి నీ ఒళ్లు పగలగొడతారు" అంటూ జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. "తెలంగాణ రాష్ట్రం ఇచ్చి కాంగ్రెస్ రాజకీయంగా లబ్ది పొందింది అంటారా ? రాజకీయంగా లబ్ది పొందింది ఎవరు ? మీరు కాదా ? కానీ ప్రజలకు రిజర్వేషన్లు దక్కలేదు, రుణమాఫీ కాలేదు, ఉద్యోగాలు ఇప్పటికీ ఇవ్వలేదు" అంటూ జగ్గారెడ్డి టీఆర్ఎస్ నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. "బాల్క సుమన్ తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నాడని, తెలంగాణ వచ్చింది కాబట్టే బాల్క సుమన్ ఎంపీ అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాడు. లేకపోతే వార్డు మెంబర్ పదవికి కూడా పనికిరాడు" అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
Next Story