Mon Dec 23 2024 00:36:48 GMT+0000 (Coordinated Universal Time)
మీడియా మేనేజ్మెంట్లో రేవంత్ రెడ్డి సక్సెస్..!
రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కాగానే మీడియా అవసరాన్ని గుర్తించారు. టీఆర్ఎస్కు, బీజేపీకి బలమైన మీడియా మద్దతు ఉన్నందున..
హైదరాబాద్ : మన దగ్గర రాజకీయాలపైన మీడియా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఒకప్పుడు మెజారిటీ మీడియా సంస్థలు ఎలాంటి వివక్ష లేకుండా కేవలం ప్రజాపక్షంగా ఉండి పని చేసేవి. ఇప్పుడు మాత్రం ఎక్కువ టీవీలు, పత్రికలు ఏదో ఒక పార్టీ పక్షాన పని చేస్తున్నాయి. ఆయా మీడియా సంస్థల యాజమానుల రాజకీయ, ఆర్థిక అవసరాలు, వ్యక్తిగత పరిచయాల ఆధారంగా పత్రికలు, టీవీలు ఏదో ఒక పార్టీకి అనుకూలంగా మారిపోయాయి. అయితే, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా పుణ్యమా అని సంప్రదాయ మీడియా ప్రభావం క్రమంగా రాజకీయాల్లో తగ్గుతోంది. అయినా కూడా ఇప్పటికీ రాజకీయ పార్టీలకు మీడియా మద్దతు మాత్రం చాలా ముఖ్యమైనది.
ఉమ్మడి రాష్ట్రంలో ముందునుంచీ కాంగ్రెస్ పార్టీకి మీడియా మద్దతు కొంచెం తక్కువే. అప్పట్లో టీడీపీకి అనుకూలంగానే మెజారిటీ మీడియా సంస్థలు ఉండేవి. అందుకే, ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్సార్ తన కుమారుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మీడియా సంస్థను ఏర్పాటుచేయించారు. కాంగ్రెస్ పార్టీ ఈ మీడియాను ఓన్ చేసుకునేది. కానీ, వైఎస్సార్ మరణం తర్వాత ఈ సంస్థ కాంగ్రెస్కు దూరమైంది. ఆ తర్వాత కాంగ్రెస్కు అనుకూలంగా చెప్పుకునే మీడియా సంస్థ రెండు తెలుగు రాష్ట్రాల్లో లేదు. అయితే, ఏపీలో కాంగ్రెస్కు పెద్దగా ఆశలు, లక్ష్యాలు లేవు కాబట్టి మీడియా మద్దతు కూడా అంతగా అవసరం లేదు.
కానీ, తెలంగాణలో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పని చేస్తోంది. ఈ పరిస్థితుల్లో మీడియా మద్దతు కూడా అవసరం. తెలంగాణలో మెజారిటీ మీడియా సంస్థలు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. కారణాలు ఏవైనా కానీ ఈ సంస్థలు ప్రభుత్వ వ్యతిరేక వార్తలు మాత్రం ఎక్కువగా రాయడం లేదు. అంతేకాదు, ప్రతిపక్షాలకు పెద్దగా స్పేస్ కూడా ఇవ్వడం లేదు. అందుకే, తమకంటూ అనుకూలంగా ఉండే మీడియా సంస్థలను ఏర్పాటుచేసుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి.
ఇప్పటికే బీజేపీలో ఉన్న ఓ కీలక నాయకుడికి ఒక పత్రిక, టీవీ ఛానల్ ఉన్నాయి. మరో బీజేపీ నాయకుడు ఒక ఛానల్ను టేకోవర్ చేసి నడిపిస్తున్నాడు. మరో రెండు ఛానళ్లు కూడా బీజేపీ వార్తలకు ప్రాధాన్యత పెంచాయి. దీంతో కొంతవరకు బీజేపీ మీడియా లోటును పూడ్చుకోగలిగింది. కానీ, కాంగ్రెస్ మాత్రం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యే వరకు ఈ విషయంలో వెనుకబడింది. ఉత్తమ్ పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు ఆయనకు పత్రికల్లో ఎక్కువగా స్పేస్ దొరికేది కాదు. ఆయన వార్తలు మధ్య పేజీల్లో సింగిల్ కాలమ్లో వచ్చేవి. ఛానళ్లలో కూడా కాంగ్రెస్ వార్తలు పెద్దగా కనిపించేవి కాదు.
కానీ, రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కాగానే మీడియా అవసరాన్ని గుర్తించారు. టీఆర్ఎస్కు, బీజేపీకి బలమైన మీడియా మద్దతు ఉన్నందున కాంగ్రెస్కు కూడా కొంత ప్రాధాన్యత ఇచ్చేలా మీడియా సంస్థలను ప్రసన్నం చేసుకోవాలనుకున్నారు. అందుకే, ఆయనకు పీసీసీ చీఫ్ పదవి రాగానే ముగ్గురు ప్రముఖ మీడియా సంస్థల యాజమానులను ప్రత్యేకంగా వెళ్లి కలిసి వచ్చారు. తాజాగా, రాహుల్ గాంధీ రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా ముగ్గురు ప్రముఖ మీడియా సంస్థల యాజమానులను తీసుకెళ్లి కలిపించారు. ఈ సమయంలో వారి కారు వద్దకు సైతం వెళ్లి స్వాగతం పలకడం, సాగనంపడం చేశారు. అంటే, వారి మద్దతు ఎంతగా రేవంత్ రెడ్డి ఆశిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ ప్రయత్నాలు బాగానే ఫలిస్తున్నాయి. గతంలో ఉత్తమ్ పీసీసీ చీఫ్గా ఉన్నప్పటి కంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వార్తలకు పలు పత్రికలు, టీవీ ఛానళ్లు బాగా ప్రాధాన్యత ఇస్తున్నాయి. రేవంత్ రెడ్డితో తరచూ ప్రత్యేక ఇంటర్వ్యూలు చేస్తున్నాయి. ఆయన వార్తలు ఎక్కువగా ప్రసారమవుతున్నాయి. మొత్తంగా రేవంత్ పీసీసీ చీఫ్ అయిన తర్వాత కాంగ్రెస్కు, ఆయనకు మీడియా కవరేజ్ బాగా పెరిగింది. ఈ విషయంలో ఆయన సక్సెస్ అయ్యారనే చెప్పుకోవాలి.
Next Story