Mon Dec 23 2024 23:48:40 GMT+0000 (Coordinated Universal Time)
అక్కడ 150 సీట్లు గెలుస్తాం : రాహుల్ గాంధీ
ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పార్టీ రాష్ట్ర శాఖ..
కర్నాటకలో అఖండ విజయం సాధించడంతో కాంగ్రెస్‌లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలపై అత్యుత్సాహం చూపడానికి ఇదే కారణం. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ సన్నాహాలు కూడా ప్రారంభించింది. ఈ ఏడాది మధ్యప్రదేశ్‌లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. కాంగ్రెస్ 150 సీట్లు గెలుచుకోబోతోందని రాహుల్ గాంధీ ప్రకటించారు.
ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పార్టీ రాష్ట్ర శాఖ, సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. సమావేశం అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటకలో మనకు 136 సీట్లు వచ్చాయి. కర్నాటకలో ఏం జరిగిందో.. మధ్యప్రదేశ్‌లోనూ అదే పునరావృతం కాబోతుందన్నారు. మేము చాలాసేపు మాట్లాడాము. మధ్యప్రదేశ్‌లో 150 సీట్లు వస్తాయని మా అంతర్గత అంచనా అని చెప్పారు.
మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి అభ్యర్ధి గురించి రాహుల్ గాంధీని ప్రశ్నించగా.. 150 సీట్లు తెచ్చుకోబోతున్నాం అంటూ అదే డైలాగ్ పునరావృతం చేస్తూ.. తెలివిగా సమాధానం దాటవేశారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లో సీఎం రేసులో కమలనాథ్ పేరు బలంగా వినిపిస్తోంది. దిగ్విజయ్ సింగ్ పేరు గురించి కూడా చర్చకు వస్తోంది. అయితే దిగ్విజయ్ సింగ్ స్వయంగా తాను ముఖ్యమంత్రి పదవిని కోరుకోవడం లేదని.. గతంలో తనను సీఎం రేసు నుండి తప్పించారని పేర్కొనడం విశేషం.
మధ్యప్రదేశ్‌ను గత రెండు దశాబ్దాలు బీజేపీ పాలించింది. మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కానీ, ఎక్కువ కాలం కొనసాగలేదు. జ్యోతిరాధిత్య సింధియా తిరుగుబాటు వల్ల కొన్ని నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది. ఈసారి ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేకతను ఎదుర్కోవలసి రావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో బీజేపీ-కాంగ్రెస్ మధ్య పోరు ఆసక్తికరంగా మారనుంది.
Next Story