Fri Dec 20 2024 04:18:33 GMT+0000 (Coordinated Universal Time)
Congress : ఇల్లు అలకగానే కాదు.. ముందుంది అసలు పండగంతా
కాంగ్రెస్ పార్టీ పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. ఆల్ హ్యాపీస్. నేతలంతా ఉత్సాహంగా ఉన్నారు. అయితే ముందుంది అసలు సమస్య.
కాంగ్రెస్ పార్టీ పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. ఆల్ హ్యాపీస్. నేతలంతా ఉత్సాహంగా ఉన్నారు. అయితే ముందుంది మొసళ్ల పండగ. ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుకు దాదాపు వంద రోజుల సమయం పడుతుందని పార్టీ సీనియర్ నేతలు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. వంద రోజుల సమయం తీసుకున్నప్పటికీ హామీలు పూర్తి స్థాయిలో అమలుకు నోచుకుంటాయా? లేదా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఖజానా చూస్తే అంత ఆశాజనకంగా లేదు. ఇచ్చిన హామీలు మాత్రం చాలానే ఉన్నాయి. ముందు ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని, తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఆమోదిస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పి మరీ అధికారంలోకి వచ్చారు. గ్యారంటీ అని చెప్పి మరీ ప్రజల నుంచి ఓట్లు సంపాదించుకున్నారు.
అన్ని హామీలను...
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్, రైతులకు, కౌలు రైతులకు రైతు భరోసా, 200 యూనిట్ల వరకూ విద్యుత్తు ఛార్జీల మినహాయింపు వంటివి ముఖ్యంగా కనపడుతున్నాయి. ఇవన్నీ ఖజానాపై భారం పడేవే. ఏ ఒక్క అంశంలోనూ వెనకడుగు వేసినా కాంగ్రెస్ సర్కార్ తొలి నాళ్లలోనే నవ్వుల పాలవుతుంది. అందుకే ఆర్థిక మంత్రితో పాటు అధికారులు కూడా దీనిపై పూర్తి స్థాయి కసరత్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మరో విషయం ప్రజల్లో నలుగుతుంది. ఇచ్చిన హామీలను అమలు చేయడానికి పన్నులు పెంచితే మాత్రం మళ్లీ ప్రభుత్వంపై విమర్శలు తలెత్తే అవకాశాలుంటాయి. కర్ణాటకలో రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తును ఇవ్వడానికి మిగిలిన వాళ్లకు విద్యుత్తు చార్జీలను పెంచారు.
పన్నులు పెంచకుండా...
అలాగే బస్సు ఛార్జీలను కూడా పెంచి మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారన్న టాక్ ఉంది. అలా ఇక్కడ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి తొలి నాళ్లలోనే ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక నిరుద్యోగుల విషయానికి వస్తే వీలయినంత త్వరగా నోటిఫికేషన్లు విడుదల చేయాల్సి ఉంటుంది. లేకుంటే నిరాశతో మళ్లీ నిరుద్యోగులు ఉద్యమ బాట పట్టే అవకాశముంది. వీటికి తోడు ఆర్థిక భారం పడే అనేక హామీలు కాంగ్రెస్ కు తొలి ఆరు నెలలు సవాళ్లుగా మారనున్నాయి. అమలు చేయడానికి నిధులు ఎక్కడి నుంచి తెస్తారు? అప్పుులు మీద ఆధారపడతారా? లేక ఇతర ఆదాయ మార్గాలను అన్వేషిస్తారా? అన్నది వచ్చే ఆర్థిక మంత్రికి శిరోభారంగా మారనుంది. హామీలు అమలు కాకుంటే ఆ ప్రభావం లోక్సభ ఎన్నికలపై చూపుతుంది. అందుకే ఎలాగైనా హామీలు అమలు చేయడానికే కొత్త ప్రభుత్వం ప్రయత్నించాల్సి ఉంది.
Next Story