Fri Nov 22 2024 09:47:14 GMT+0000 (Coordinated Universal Time)
CPI : నారాయణా... ఒకటి గెలవగానే...బలమొచ్చినట్లుందే?
సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని ప్రకటించారు
తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడానికి అనేక కారణాలున్నాయి. అప్పటి ప్రభుత్వంపై వ్యతిరేకతతో పాటు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రజలు విశ్వసించారు. పైగా అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకూ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా శ్రద్ధ తీసుకుంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఛాస్స్ ఇస్తే తప్పేమిటన్న ధోరణికి ప్రజలు వచ్చారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత కూడా కాంగ్రెస్ పార్టీకి కలసి వచ్చింది. అన్నీ కలసి వస్తేనే చిట్టచివరకు 65 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థానాలు దక్కలేదు. కాంగ్రెస్ పార్టీ 70 నుంచి 75 స్థానాలు వస్తాయని అంచనా వేసింది.
తమ వల్లనేనంటూ....
అయితే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరూ తమ వల్లనే పార్టీ గెలిచిందని జబ్బలు చరుచుకుంటున్నారు. చివరకు సీీపీఐ నారాయణ కూడా తమ వల్లనే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిందని చెబుతున్నారు. తమతో పొత్తు పెట్టుకోవడం వల్లనే కాంగ్రెస్ కు ఇన్ని స్థానాలు వచ్చాయని నారాయణ అన్నారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో వామపక్షాల పార్టీలు చెరి నాలుగు అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కోరినా ఒక్క స్థానంతోనే సరిపెట్టాయి. సీపీఎం అది నచ్చక విడిగా పోటీ చేసి ఓటమి పాలయింది.
పొత్తులో భాగంగా...
సీపీఐ మాత్రం కొత్తగూడెం సీటును తీసుకుని అక్కడ విజయం సాధించి ఎట్టకేలకు అసెంబ్లీలోకి అడుగుపెట్టగలిగింది. అయితే ఆ గెలుపును చూసి ఇప్పుడు కామ్రేడ్లు సంబరపడిపోతున్నారు. తమతో పొత్తు వల్లనే కాంగ్రెస్ గెలిచిందని అనడమే కాకుండా రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఏపీ, తెలంగాణల్లో ఒక్కో పార్లమెంటు స్థానంలో పాటీ చేస్తామని నారాయణ ప్రకటించారు. తమకు ప్రత్యేక ఓటు బ్యాంకు ఉన్న కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీకి దిగుతామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ లో....
అయితే ఏపీలో టీడీపీ కమ్యునిస్టులతో జత కడుతుందా? లేదా? అన్న స్పష్టత ఇంకా రాలేదు. అక్కడ బీజేపీతో జతకట్టాలని టీడీపీ, జనసేన చూస్తున్నాయి. తెలంగాణలో ఉన్న పదిహేడు పార్లమెంటు స్థానాల్లో ఒకటివ్వాలంటూ కాంగ్రెస్ కు అల్టిమేటం ఇచ్చారు. మళ్లీ చర్చలు జరపాలని చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ ఈసారి ఒక్క స్థానం ఇస్తుందా? లేదా? అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. నారాయణ మాత్రం తాము ఒంటరిగానైనా పోటీ చేసి తీరుతామని ప్రకటించడం విశేషం.
Next Story