Sat Nov 23 2024 03:51:35 GMT+0000 (Coordinated Universal Time)
Ys sharmila : చివరకు లాస్ అయ్యేది వాళ్లేనా?
కాంగ్రెస్ తీసుకుంటున్న నిర్ణయం ఆ పార్టీకి కొంత శాపంగా మారుతుంది. ఈసారి షర్మిల రూపంలో కొంత దెబ్బతినే అవకాశాలున్నాయి.
కాంగ్రెస్ ఒక్కోసారి తీసుకుంటున్న నిర్ణయం ఆ పార్టీకి కొంత శాపంగా మారుతుంది. ఈసారి షర్మిల రూపంలో కొంత దెబ్బతినే అవకాశాలున్నాయి. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్లకు కండువాలు కప్పేస్తున్న పార్టీ హైకమాండ్ వైఎస్ తనయ షర్మిల విషయంలో మాత్రం ఆలోచించింది. అదే ఇప్పుడు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానన్న షర్మిల ప్రతిపాదనకు హైకమాండ్ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఆమె 119 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతుంది.
పాలేరులో మాత్రం...
అయితే అన్ని నియోజకవర్గాల్లో షర్మిల ప్రభావం ఉంటుందా? అంటే చెప్పలేం కాని... ఆమె పోటీ చేసే పాలేరులో మాత్రం ఖచ్చితంగా కొంత ప్రభావం చూపే అవకాశముందని చెబుతున్నారు. షర్మిల తాను తొలి నుంచి పాలేరు నియోజకవర్గంలోనే పోటీ చేస్తానని ప్రకటించారు. అక్కడ సొంత పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. పాలేరులో రెడ్డి సామాజికవర్గం అధికంగా ఉండటంతో పాటు వైఎస్ అభిమానుల సంఖ్య కూడా ఎక్కువగా ఉండటంతోనే ఆమె పాలేరును ఎంచుకున్నారన్న సంగతి ప్రతి ఒక్కరికీ తెలిసిందే.
తుమ్మలకు మాత్రం...
అయితే ఇప్పుడు పాలేరు నుంచి తాను పోటీ చేయనున్నట్లు షర్మిల ప్రకటించడంతో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి ఇబ్బందులు తప్పేట్లు లేవు. పాలేరు నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బరిలోకి దిగాలని ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఆయన పార్టీ మారి మరీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి చేతిలోనే తుమ్మల నాగేశ్వరరావు ఓటమి పాలయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్లో చేరినప్పటికీ ఒక ప్రధాన సామాజికవర్గం తుమ్మల వైపు నిలిచే అవకాశం లేదంటున్నారు.
ఓట్లు చీల్చుకుని...
అదే సమయంలో షర్మిల కూడా భారీగా ఓట్లు చీల్చుకునే అవకాశముందని, ఇది కాంగ్రెస్ పార్టీకే నష్టమన్న అంచనాలు మాత్రం వినపడుతున్నాయి. షర్మిల పోటీ చేస్తే తుమ్మల విజయానికి ఇబ్బంది ఏర్పడటం ఖాయమన్నది పరిశీలకులు సయితం అంగీకరిస్తున్న విషయం. అదే వైఎస్సార్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసుకుని ఉంటే పాలేరు ఖచ్చితంగా కాంగ్రెస్ ఖాతాలో పడేదని, ఇప్పుడు మాత్రం శ్రమించకతప్పదని అంటున్నారు. షర్మిల నిర్ణయంతో పాలేరులో కారు పార్టీ అభ్యర్థి నెత్తిన పాలు పోసినట్లేనన్న కామెంట్స్ వినపడుతున్నాయి. మరో వైపు షర్మిల విజయావకాశాలను కూడా కొట్టిపారేయలేం అని చెబుతున్నారు. మరి వైఎస్ షర్మిల ఏ మేరకు ఓట్లు చీల్చి ఎవరికి నష్టం కలిగిస్తారు? అన్నది డిసెంబరు 3న తేలనుంది.
Next Story