Sun Nov 17 2024 16:24:35 GMT+0000 (Coordinated Universal Time)
Devineni Uma : ఫస్ట్ టైం దేవినేని టిక్కెట్ గాలిలో వేలాడుతుందా? అదే నిజమైతే?
దేవినేని ఉమకు ఫస్ట్ టైం రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆయనకు మైలవరంలో సొంత పార్టీలోనే ప్రతిపక్షం తయారయింది.
Devineni Uma, Political life: రాజకీయాలు అంతే. ఒకప్పుడు అంతా తామే అయనట్లు ఫీలయిన నేతలు కాలం కలసిరాకపోతే ఎన్నికల వేళ ఇబ్బందులు పడుతుంటారు. తమకు పార్టీలో ఇక తిరుగులేదన్న నేతలకు కూడా ఎన్నికల వేళ షాక్ లు తగులుతుంటాయి. వాళ్లే కాదు.. వారి అనుచరులు కూడా కలలో కూడా ఊహించి ఉండరు. ఇప్పుడు అలాంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీలో దేవినేని ఉమ ఎదుర్కొంటున్నారు. దేవినేని ఉమ అంటే టీడీపీ సీనియర్ నేతగానే కాకుండా పార్టీకి కమిట్మెంట్ ఉన్న నేతగా గుర్తింపు పొందారు. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడంలో ఆయన ముందుంటారు. 2014లో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న దేవినేని ఉమ కృష్ణా జిల్లాలో పార్టీని ఒంటి చేత్తో నడిపించారు.
స్వపక్షంలోనే విపక్షం....
అలాంటి దేవినేని ఉమకు ఫస్ట్ టైం రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆయనకు మైలవరంలో సొంత పార్టీలోనే ప్రతిపక్షం తయారయింది. దేవినేని ఉమకు టిక్కెట్ ఇవ్వవద్దంటూ పెద్దయెత్తున ఆందోళనలకు దిగారు. టీడీపీ అధినాయకత్వం వద్దకు కూడా ఉమకు టిక్కెట్ ఇస్తే తాము సహకరించేది లేదని అల్టిమేటం ఇచ్చారు. ఇక్కడ బొమ్మసాని సుబ్బారావు టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. పార్లమెంటు సభ్యుడు కేశినేని నానికి సన్నిహితుడైన బొమ్మసాని ఆయన వైసీపీలో చేరినా తాను మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నారు. అయితే దేవినేని ఉమకు ఈసారి మైలవరం టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సర్వేలో తేలడంతో...
అందుకు ప్రధాన కారణాలు ఆయనపై పార్టీ క్యాడర్ లో పెద్దయెత్తున అసంతృప్తి ఉందని సర్వేల్లో వెల్లడయింది. ఆయనకు అక్కడ నుంచి పోటీ చేయిస్తే మరోసారి వైసీపీకి మైలవరాన్ని అప్పగించినట్లేనన్న భావన టీడీపీ అధినాయకత్వంలో ఏర్పడింది. ఇప్పటికే దేవినేని ఉమకు మైలవరం టిక్కెట్ ఉండదన్న సంకేతాలు పార్టీ నుంచి వెళ్లడంతో ఆయన అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అయితే తరచూ తన ముఖ్యమైన అనుచరులతో సమావేశమవుతూ పార్టీ తనకే టిక్కెట్ ఇస్తుందన్న నమ్మకాన్ని ఆయన కలిగిస్తున్నారు. ఇటీవల మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆ పార్టీ నుంచి దూరమయి టీడీపీలోకి చేరతారన్న ప్రచారం జరుగుతుంది.
నియోజకవర్గం మార్చినా...
మైలవరం టిక్కెట్ వసంత కృష్ణ ప్రసాద్ కు ఇచ్చి దేవినేని ఉమను పెనమలూరు నియోజకవర్గానికి పంపాలన్న యోచనలో కూడా అధినాయకత్వం ఉందని తెలుస్తోంది. అయితే తాను మైలవరాన్ని వీడేది లేదని దేవినేని ఉమ చెబుతున్నారు. పెనమలూరు టీడీపీకి అనుకూల నియోజకవర్గమైనా మైలవరాన్ని వీడేందుకు ఆయన సిద్ధంగా లేరన్నది సన్నిహితుల నుంచి వస్తున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. దీంతో అధినాయకత్వం ఆలోచన ప్రకటన రూపంలో వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోవచ్చన్న ధోరణిలో దేవినేని ఉమ ఉన్నట్లు తెలిసింది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పడు తాను యాక్టివ్ గా ఉన్నానని, అలాంటి తనకే టిక్కెట్ ఇవ్వకపోతే రాంగ్ సిగ్నల్స్ క్యాడర్ లోకి వెళతాయని ఆయన అంటున్నట్లు తెలిసింది. చంద్రబాబు మాత్రం ఈసారి గెలుపు అవకాశాలు ఖచ్చితంగా ఉన్న వారికే టిక్కెట్ అని చెప్పడంతో దేవినేని ఉమ టిక్కెట్ గాలిలోనే ఉందని తెలుస్తోంది.
Next Story