Sun Nov 17 2024 22:47:39 GMT+0000 (Coordinated Universal Time)
Ap Politics : కుటుంబాలకు కుటుంబాలే.. రాజకీయాలకు దూరమయ్యాయిగా.. ఇది ఊహించనిదే
ఆంధ్రప్రదేశ్ లో ఈసారి జరుగుతున్న ఎన్నికలు వెరీ వెరీ స్పెషల్. కొన్ని కుటుంబాలకు టిక్కెట్లు ఈసారి దక్కలేదు
ఆంధ్రప్రదేశ్ లో ఈసారి జరుగుతున్న ఎన్నికలు వెరీ వెరీ స్పెషల్. గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు దశాబ్దాలుగా రాజకీయాలు శాసిస్తున్న కుటుంబాలను పక్కన పెట్టడమే ప్రత్యేకత. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. చాలా కుటుంబాలకు ఈ ఎన్నికల్లో ఒకింత షాక్ తగిలిందనే చెప్పాలి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో సీట్లు కోల్పోయి.. ఈ ఎన్నికలకు దూరంగా ఉన్న అనేక కుటుంబాలు రాజకీయంగా దూరమయ్యాయనే చెప్పాలి. రేసు గుర్రాలకే టిక్కెట్లు అంటూ టీడీపీ అధినేత వివిధ సర్వేలు చేయించి మరీ టిక్కెట్లు ప్రకటించడంతో కొన్ని కుటుంబాలు రాజకీయంగా కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ కుటుంబాల వారికి అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవి ఇస్తామని చంద్రబాబు చెబుతున్నప్పటికీ ప్రత్యక్ష ఎన్నికలకు అయితే వారు దూరమయినట్లే చెప్పుకోవాలి.
రెండు సీట్లు అడిగితే...
గుంటూరు జిల్లాలో రాయపాటి కుటుంబం దశాబ్దాల పాటు రాజకీయాలను శాసించింది. అలాంటిది ఈసారి రాయపాటి కుటుంబంలో ఎవరికీ టిక్కెట్ దక్కలేదు. రాయపాటి సాంబశివరావు గత ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంటు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయన తన కుటుంబంలో రెండు టిక్కెట్లు అడిగితే చంద్రబాబు ఒక్క టిక్కెట్ కూడా ఇవ్వలేదు. దీంతో ఆ కుటుంబం ఇప్పుడు ఎక్కడా పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అదే జిల్లాలో దశాబ్దాలు శాసించిన కోడెల కుటుంబం కూడా అంతే. కోడెల శివప్రసాదరావు మృతితో ఆయన కుమారుడు శివరాంకు టిక్కెట్ ఇస్తారని భావించారు. సత్తెనపల్లి టిక్కెట్ ను ఆశించారు. కానీ సత్తెనపల్లికి కన్నా లక్ష్మీనారాయణను అభ్యర్థిగా ప్రకటించడంతో కోడెల కుటుంబం కూడా ప్రత్యక్ష ఎన్నికల నుంచి పక్కకు జరిగినట్లే అనుకోవాల్సి ఉంటుంది.
తనంతట తానే...
గల్లా కుటుంబానిది మరో ప్రత్యేకత. వారంతట వారే స్వచ్ఛందంగా ఈదఫా పోటీ నుంచి తప్పుకున్నారు. వ్యాపారాలను చూసుకునేందుకు వీలుగా తాను ఈసారి పోటీ చేయడం లేదని గల్లా జయదేవ్ ఇదివరకే ప్రకటించారు. దీంతో గల్లా కుటుంబం నుంచి కూడా ఈసారి ఎవరూ పోటీ చేయడం లేదు. రెండుసార్లు వరసగా గుంటూరు ఎంపీగా గెలిచిన జయదేవ్ కేవలం వ్యాపార కారణాల రీత్యానే పాలిటిక్స్ కు బ్రేక్ ఇచ్చారు. ఆయన కుటుంబం ఈ ఎన్నికల్లో దూరంగా ఉంది. అలాగే వంగవీటి కుటుంబం నుంచి కూడా ఈసారి ఎవరూ పోటీ చేయడం లేదు. వంగవీటి రాధా కూడా గత ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా ప్రచారానికే పరిమితమవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆయనకు కూడా ఎక్కడా టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో వంగవీటి కుటుంబం మరోసారి ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగానే ఉండనుంది.
గెలుపు ను బట్టి...
మరో కీలక నేత మాగంటి బాబు కుటుంబానికి కూడా ఈసారి టిక్కెట్ దక్కే అవకాశం లేదు. ఏలూరు పార్లమెంటు టిక్కెట్ బీసీ సామాజికవర్గానికి ఇవ్వాలని చంద్రబాబు ఫిక్స్ అయ్యారు. అలాగే వైసీపీలో ఉన్న కోటగిరి కుటుంబం కూడా ఈసారి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది. కోటగిరి శ్రీధర్ కు కాకుండా వైసీపీ ఈసారి కారుమూరి సునీల్ కుమార్ కు టిక్కెట్ ఇచ్చింది. ముద్రగడ కుటుంబం చాలా రోజుల తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చింది. ఆయన కుటుంబం వైసీపీలో చేరింది. అయితే ఆయనకు గాని, ఆయన కుటుంబ సభ్యులకు కాని వైసీపీ ఎక్కడా టిక్కెట్ ఇవ్వలేదు. ముద్రగడ కూడా ఈసారి ప్రచారానికే పరిమితం కానున్నారు. అలా ఈ కుటుంబాలన్నీ ప్రత్యక్ష ఎన్నికలకు అనేక కారణాలతో దూరమయ్యాయి. టిక్కెట్లు దక్కకపోవడంతో పాటు వారి పట్ల ప్రజల్లో ఆదరణ తగ్గడం కూడా కొంత కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
హోల్డ్ లో పెట్టి...
మరోవైపు ఇంకా టిక్కెట్లు తేలకపోయినా.. దేవినేని కుటుంబానికి కూడా ఈసారి టిక్కెట్ దక్కే అవకాశం లేదని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆయనకు మూడు జాబితాల్లో టిక్కెట్ దక్కలేదు. ఆయనను మైలవరం నుంచి పెనమలూరుకు పంపాలని భావించినా ఇప్పుడు అందుకు కూడా అధినేత మనసు మార్చుకున్నారంటున్నారు. ఇక గంటా శ్రీనివాసరావు పేరు కూడా మూడు జాబితాల్లో పేరు కనిపించలేదు. ఆయనను చీపురుపల్లి వెళ్లాలని చంద్రబాబు చెప్పినా అందుకు అంగీకరించకపోవడంతో ఆయన పేరును హోల్డ్ లో పెట్టారు. సీనియర్ నేత కళా వెంకట్రావు పేరు కూడా ఎక్కడా కనిపించలేదు. ఆయనకు ఈసారి సీటు దక్కుతుందా? లేదా? అన్నది సందేహంగానే ఉంది. మొత్తం మీద 2024 ఎన్నికలు ఏపీలో అనేక కుటుంబాలను రాజకీయాల నుంచి దూరం చేశాయి.
Next Story