Mon Dec 23 2024 08:27:48 GMT+0000 (Coordinated Universal Time)
TDP : టిక్కెట్ నాకే నంటూ పోస్టర్లు.. మండిపడుతున్న సీనియర్లు
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అన్ని టీడీపీలో సీట్ల సిగపట్లు మొదలయ్యాయి. ప్రొద్డుటూరులో పోసర్టు కలకలం రేపాయి
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అన్ని పార్టీల్లో సీట్ల సిగపట్లు మొదలయ్యాయి. అభ్యర్థులను ఖరారు చేయకముందే కొందరు తామే అభ్యర్థులమంటూ ప్రకటించుకోవడం కొత్త తలనొప్పిగా మారింది. తెలుగుదేశం పార్టీలో ఇటువంటి పరిణామాలే చోటు చేసుకున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. టీడీపీ ఫస్ట్ లిస్ట్ కూడా విడుదల కాలేదు. టీడీపీ పొత్తుల కోసం వెయిట్ చేస్తుంది. జనసేనతో పొత్తు ఖరారయినప్పటికీ, బీజేపీ ఈ కూటమితో కలసి వస్తుందా? రాదా? అన్నది తేలాల్సిఉంది. పొత్తులు తేలితే కాని ఏ సీటు ఎవరికి కేటాయించాలన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశం లేదు.
ఉదయం పోస్టర్లు కనిపించడంతో...
అయితే కొన్ని చోట్ల తామే అభ్యర్థులమంటూ పోస్టర్లు వేసుకోవడం పార్టీలో చర్చకు దారి తీస్తుంది. ప్రొద్దుటూరులో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ప్రొద్దుటూరు లో ఈ సారి సీటు కోసం అనేక మంది పోటీ పడుతున్నారు. ఈరోజు ఉదయం నిద్ర లేచే సరికి ప్రొద్దుటూరు మొత్తం ప్రవీణ్ కుమార్ రెడ్డి అభ్యర్థి అంటూ వాల్ పోస్టర్లు వెలిశాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయాలని, సైకిల్ గుర్తుకే మన ఓటు వేయాలని అంటూ పోస్టర్ చివరలో టీడీపీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ రెడ్డి అని ఉండటంతో చర్చనీయాంశమైంది. ఆయనకు టీడీపీ అధినేత టిక్కెట్ ఖరారు చేశారా? అన్న చర్చ పార్టీలో జరుగుతుంది. దీనిపై కొందరు పార్టీ నాయకత్వానికి కూడా ఫిర్యాదు చేశారు.
హైకమాండ్కు ఫిర్యాదు..
ప్రొద్దుటూరు టీడీపీ టిక్కెట్ కోసం ప్రవీణ్ కుమార్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులు రెడ్డి, లింగారెడ్డిలు పోటీ పడుతున్నారు. వీరితో పాటు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సోదరుడు కూడా పోటీలో ఉన్నారు. వీరందరిని కాదని తనకే టిక్కెట్ ఇచ్చినట్లు, తానే అభ్యర్థిని అన్నట్లు ప్రకటించుకుంటూ పోస్టర్లు వేసుకోవడం ఏంటని అధినాయకత్వాన్ని ఈ నేతలు ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే దీనిపై పార్టీ హైకమాండ్ నుంచి కూడా ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేయగా, తన అనుచరులు తొందరపడి వాల్ పోస్టర్లను ముద్రించారని, ఇందులో తనకు ఏ మాత్రం సంబంధం లేదని వివరణ ఇచ్చినట్లు తెలిసింది.
Next Story