ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ.. దాని వెనుకున్నదేవరు!
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది.
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన పారిశ్రామికవేత్త, బీసీ నాయకులు బోడె రామచంద్ర యాదవ్ ఈ పార్టీని స్థాపించారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఆచార్య నాగార్జు యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ప్రజాసింహ గర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు మరో తొమ్మిది నెలల్లో జరగనున్నాయి. ఈ సమయంలో కొత్త పార్టీ పుట్టుకు రావడంపై చర్చనీయాంశంగా మారింది.
అప్పట్లో ఎన్టీ రామారావు కూడా ఎన్నికలకు తొమ్మిది నెలల ముందే పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సరిగ్గా అలానే.. ఎన్నికలకు తొమ్మిది నెలల సమయం ఉన్న సమయంలో కొత్త పార్టీ ఆవిర్భవించడం గమనార్హం. కాగా పార్టీ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలోని వాలంటీర్ వ్యవస్థఫై బోడె రామచంద్రయాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లకు నెలకు 5 వేల రూపాయలు మాత్రమే ఇస్తూ.. వారితో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని అన్నారు. ఇటీవల వైసీపీ సమావేశం అయ్యాక, అక్కడ రోడ్డుపై వారితో చెత్త ఎత్తించారని అన్నారు. తాము ఆ యువతకు బంగారు బాట వేసేందుకు వస్తున్నామని చెప్పుకొచ్చారు. తమ పార్టీ బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందని ఆయన చెప్పారు.
అవినీతి రహిత సుపరిపాలన అందించడమే లక్ష్యంగా కొత్త రాజకీయ పార్టీని పెడుతున్నట్టు చెప్పారు. ఇదిలా ఉంటే.. 2019లో రామచంద్రయాదవ్ జనసేన పార్టీ అభ్యర్థిగా పుంగనూరు నుంచి పోటీ చేశారు. అప్పుడు రాజకీయాలకు కొత్త కావడంతో ఓడిపోయారు. మరోవైపు రామచంద్ర యాదవ్ వెనుక ఉన్నదెవరన్నదానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆయన వెనక ఎవరో ఒక బలమైన శక్తి ఉన్నారని, వారెవరో తెలియాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రహోంమంత్రి అమిత్‌షాను కలిసి.. వైప్లస్ సెక్యూరిటీ తెచ్చుకున్న రామచంద్రయాదవ్‌కు రాష్ట్రం బయట మంచి పలుకుబడి ఉన్నట్టు కనిపిస్తోంది. ఇటీవల పుంగనూరులో రామచంద్రయాదవ్ విస్తృత పర్యటనలు చేస్తున్నారు.