Sun Dec 22 2024 23:10:51 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : రాజకీయాల నుంచే తప్పుకుంటా.. హైకమాండ్ కు బాలినేని హెచ్చరికలు
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ అధినాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ హైదరాబాద్కు వెళ్లిపోయారు
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ అధినాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ హైదరాబాద్కు వెళ్లిపోయారు. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ కో - ఆర్డినేటర్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమిస్తూ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో ఆయన మండిపడుతున్నారు. తన మాట జిల్లాలో చెల్లుబాటు కావడం లేదని ఆయన కొంతకాలంగా అసహనంతో ఉన్నారు. తాను పార్టీలో ఉంటూ సమన్వయంతో ముందుకు వెళుతున్న తన మాటలను అధినాయకత్వం బేఖాతరు చేయడంపై ఆయన మరోసారి అలిగినట్లు చెబుతున్నారు.
పట్టు బట్టినా...
ఒంగోలు పార్లమెంటు టిక్కెట్ విషయంలో బాలినేని పట్టుపట్టారు. తిరిగి మాగుంట శ్రీనివాసరెడ్డికి టిక్కెట్ ఇవ్వాలంటూ ఆయన గత కొంతకాలంగా అధినాయకత్వం దృష్టికి తీసుకెళుతున్నారు. కానీ కారణాలు తెలియదు కానీ పార్టీ హైకమాండ్ మాత్రం మాగుంట కు టిక్కెట్ ఇచ్చేందుకు ఇష్టపడటం లేదు. దీంతో రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చిన బాలినేని సజ్జల రామకృష్ణారెడ్డితో చర్చలు జరిపారు. సజ్జల కొంత క్లారిటీ ఇవ్వడంతో బాలినేని మెత్త బడినట్లే కనిపించింది.
సమసిపోయిందనుకుంటున్న సమయంలో...
ఒంగోలు వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డి తాను పార్టీ మారబోనని, ఎంపీ టిక్కెట్ ఎవరికి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని చెప్పారు. దీంతో వివాదం సమసి పోయిందనుకున్నారు. కానీ తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇన్ఛార్జిగా నియమించడంతో బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహంతో ఊగిపోయినట్లు తెలిసింది. తన మాటకు విలువ లేని చోట తాను ఉండటమెందుకని సన్నిహితులో అన్న బాలినేని హైదరాబాద్ కు వెళ్లారని చెబుతున్నారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని కూడా ముఖ్యనేతలకు ఆయన చెప్పినట్లు తెలిసింది.
తన ప్రమేయం లేకుండా
బాలినేని శ్రీనివాసరెడ్డి తొలి నుంచి మాగుంట సీటు విషయంలో పట్టుబట్టారు. అయితే చెవిరెడ్డి తప్ప మరెవరికైనా సీటు ఇస్తే తాను సహకరిస్తానని చెెప్పి మరీ వచ్చారు. అలా వచ్చారో లేదో.. వెంటనే పార్లమెంటు కో ఆర్డినేటర్ గా నియమించడాన్ని బాలినేని జీర్ణించుకోలేకపోతున్నారు. రెండో విడత మంత్రివర్గ విస్తరణలో తనకు చోటు కల్పించకపోవడంపై అసంతృప్తితో ఉన్న బాలినేని కనీసం జిల్లా పార్టీలో తన ప్రమేయం లేకుండా చేసే కుట్ర జరుగుతుందని భావించి ఆయన రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యారని కొందరు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. చివరకు జిల్లా పోలీసు బదిలీలు కూడా బాలినేనికి తెలియకుండా జరగడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లు మరింత ఆగ్రహానికి ఆయన గురయ్యారు.
Next Story