Sat Jan 11 2025 07:58:31 GMT+0000 (Coordinated Universal Time)
Maganti Babu : టీడీపీకీ గుడ్ బై.. వైసీపీలో చేరికకు రెడీ.. ఏలూరులో సైకిల్ పార్టీకి భారీ షాక్
మాగంటి బాబు టీడీపీని వీడీ వైసీపీలో చేరబోతున్నారు. రేపు ఆత్మీయ సమావేశంలో నిర్ణయం చెప్పబోతున్నారు
ఏలూరు పార్లమెంటు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది మాగంటి కుటుంబం. మాగంటి రవీంద్రనాధ్ చౌదరి నుంచి ఇక్కడ రాజకీయంగా ఒక బేస్ ఏర్పాటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ ఫ్యామిలీకి ఒక స్పెషాలిటీ ఉంది. సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉంది. తండ్రి, తల్లి, ఆయన కూడా మంత్రులుగా పనిచేసిన ఘనత దక్కించుకున్నారు. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంతో ఆయనకు ప్రత్యేక మైన అనుబంధం కూడా ఉంది. ఆయన వయసు రీత్యా, కుటుంబంలో జరిగిన కొన్ని ఘటనలు ఆయనను రాజకీయాలకు కొంత దూరం చేసినా తిరిగి వాటి నుంచి కోలుకుని యాక్టివ్ గా మారడంతో ఆయనకే టిక్కెట్ అనుకున్నారు.
కమ్మ వారి ఆగ్రహం...
పైగా ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం ఎప్పటి నుంచో కమ్మ సామాజికవర్గం నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్నది. అలాంటి నియోజకవర్గాన్ని ఈసారి మాగంటి బాబుకు కాదని పుట్టా మహేశ్ యాదవ్ కు ఇచ్చారు. ఈయన టీడీపీ లో సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అల్లుడు. కమ్మ సామాజికవర్గానికి కాదని వేరే వాళ్లకు టిక్కెట్ ఇచ్చారని ఇప్పటికే ఆ సామాజికవర్గం నేతలు టీడీపీ హైకమాండ్ పై గుర్రుగా ఉన్నారు. దీనికి తోడు మాగంటి బాబుకు టిక్కెట్ నిరాకరించడాన్ని కూడా తప్పు పడుతున్నారు. వైసీపీ బీసీ అభ్యర్థిని పోటీకి దింపిందని, టీడీపీ కూడా అదే సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని దింపడమేంటని ప్రశ్నిస్తున్నారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుందని కామెంట్ చేస్తున్నారు
ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్...
కాగా మాగంటి బాబు తండ్రి రవీంద్రనాధ్ చౌదరి, తల్లి మాగంటి లక్ష్మీదేవి ఇద్దరు రాష్ట్ర మంత్రులుగా పనిచేశారు. 1998 లో మాగంటి బాబు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఏలూరు ఎంపీగా విజయం సాధించారు. తర్వాత దెందులూరు నుంచి పోటీ చేసి వైఎస్ కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు. అనంతరం ఆయన టీడీపీలోకి మారారు. 2009లో ఏలూరు ఎంపీగా పోటీ చేసి ఆయన ఓటమిపాలయినా.. తిరిగి 2014లో సైకిల్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. లక్ష ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచారు. రెండున్నర దశాబ్దాలుగా ఏలూరు ఎంపీ సీటుతో అనుబంధం ఉన్న మాగంటి బాబు టీడీపీ తరపున ఇప్పటికే 2009, 2014 ఎన్నికల్లో వరుసగా పోటీ చేస్తున్నారు.
రేపు ఆత్మీయులతో సమావేశం...
కానీ ఈసారి టిక్కెట్ దక్కకపోవడంతో ఆయన మనస్తాపానికి గురయినట్లు తెలిసింది. రెండు రోజుల్లో ఆయన వైసీపీలో చేరతారని సమాచారం. వైసీపీ అధినేత జగన్ స్వయంగా ఫోన్ చేసి మాగంటి బాబును పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలిసింది. మాగంటి కూడా అందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. రేపు మాగంటి బాబు తన ఆత్మీయులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలోనే మాగంటి బాబు వైసీపీలో చేరనున్న ప్రకటనను చేయనున్నట్లు ఆయన అనుచరులు తెలిపారు. తన ఇద్దరు కుమారులు స్వల్ప వ్యవధిలో మరణించడంతో కొంత రాజకీయాలకు విరామమిచ్చినా తర్వాత యాక్టివ్ అయ్యారు. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కూడా కలిశారు. అయితే టీడీపీలో కష్టపడిన వారిని గుర్తించడం లేదని భావించి ఆయన వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది.
Next Story