Sun Jan 12 2025 01:25:42 GMT+0000 (Coordinated Universal Time)
Nallari Kiran Kumar Reddy : కదలడు.. వదలడు.. ఇదేందయ్యా బాబూ?
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఎన్నికల సమయంలో మళ్లీ కనిపించకుండా పోయారు
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఎన్నికల సమయంలో మళ్లీ కనిపించకుండా పోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఆయనను తెలంగాణ ఎన్నికల కోసమే పార్టీలోకి తీసుకున్నారని ప్రచారం జరిగింది. తెలంగాణ బీజేపీ పార్టీ కార్యాలయంలో కూడా ఆయన కనిపించారు. సీమాంధ్ర ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయన ఉపయోగపడతారని కమలం పార్టీ అంచనా వేసి మరి అక్కున చేర్చుకుంది. ఆయన వల్ల కొన్ని ఓట్లు అయినా రాకపోతాయా? అని భావించి మరీ కిరణ్ కుమార్ రెడ్డికి కండువా కప్పేసింది. ప్రధాని మోదీ వచ్చినప్పుడు కూడా ఆయన స్వాగతం పలుకుతూ ఎయిర్పోర్టులో కనిపించారు.
మాజీ ముఖ్యమంత్రి అని...
ఇక కాంగ్రెస్ లో కొన్నేళ్లు పాటు ఉన్నా సైలెంట్ గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరిన తర్వాత యాక్టివ్ అవుతారని భావించారు. అయితే ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయడంతో ఇటు తెలంగాణకు, అటు ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఎన్నికలకు బాగా పనికొస్తాడని, పనిమంతుడని నమ్మి పార్టీలో చేర్చుకున్నారు. పైగా మాజీ ముఖ్యమంత్రి అన్న ట్యాగ్ మెడకు వేలాడుదీసుకుని తిరుగుతుండటం కూడా ఆయనకు ప్లస్ పాయింట్ అయింది. ఆయన పార్టీలో చేరితే రెడ్డి సామాజికవర్గం ఓటర్లు కమలం వైపు చూస్తారని భావించారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి వల్ల తెలంగాణలో లాభం కంటే నష్టమే ఎక్కువ అని గ్రహించినట్లుంది. అందుకే ఆయనను ఈ ఎన్నికలకు దూరం పెట్టింది.
నష్టమే తప్ప...
గత కొద్ది రోజులుగా ఆయన తెలంగాణలో కనిపించడం మానేశారు. పోనీ తెలంగాణలో ఆయనపై వ్యతిరేకత ఉంది కదా? అనుకుంటే... ఏపీ బీజేపీలోనైనా యాక్టివ్ గా ఉండాలి కదా? మరి అక్కడ కూడా కనిపించడం మానేశారు. ఆయన అప్పడెప్పుడో ఏపీకి వచ్చి ఒక మీడియా సమావేశం పెట్టి కనిపించి వెళ్లిపోయారు. తర్వాత బీజేపీ అధ్యక్షురాలు పురంద్రీశ్వరి బాధ్యతలను చేపట్టే సమయంలో ఒక లుక్ వేసి వెళ్లిపోయారు. ఇక అంతే ఆయన అడ్రస్ లేదు. హైదరాబాద్ లోనే ఉంటున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడా, అక్కాడ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయనను అసలు పార్టీలోకి ఎందుకు తీసుకున్నట్లు అన్న చర్చ మొదలయింది.
ఏపీలోనూ అంతేనా?
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణలో పార్టీ కార్యాలయానికి రాగానే విజయశాంతి గుర్రుగా చూశారు. సమైక్య వాది మన పార్టీలోకి రావడమేంటని జాతీయ పార్టీ మహిళ నేత కస్సుమన్నారు. ఆమె వేదికపైకి ఎక్కకుండానే వెళ్లారు. తెలంగాణ ద్రోహులను పార్టీలోకి తీసుకున్నందుకు తాను వేదికపైకి వెళ్లలేదని కూడా విజయశాంతి చెప్పారు. అలా తెలంగాణలో ఆయన రాక లాభం కాకుండా నష్టమే తెచ్చింది. పోనీ సమైక్యాంధ్ర కోసం పోరాడిన ఏపీలోనైనా ఆయన కాలు కదుపుతారునుకుంటే అది కమలనాధులకు అత్యాశే మిగిలింది. కదలడు.. వదలడు... అన్న తరహాలో ఆయన ఏ పార్టీలో ఉన్నా వ్యవహరిస్తుండటంతో రాజకీయంగా వ్యక్తిగతంగా నష్టపోతురన్నారు.
Next Story