Mon Dec 23 2024 03:30:21 GMT+0000 (Coordinated Universal Time)
Nallari Kiran Kumar : కసి తీర్చుకోవడానికి రెడీ.. ప్రత్యర్థిని మట్టికరిపిస్తే.. రెండు ప్రయోజనాలట
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పదేళ్ల గ్యాప్ తర్వాత తన లక్‌ను పొలిటికల్‌గా పరీక్షించుకోనున్నారు
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పదేళ్ల గ్యాప్ తర్వాత తన లక్‌ను పొలిటికల్‌గా పరీక్షించుకోనున్నారు. ఈసారి ఆయన రాజంపేట నుంచి బరిలోకి దిగనున్నారు. బీజేపీలో ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన రాష్ట్ర విభజన ఎట్టిపరిస్థితుల్లో జరగదని చెప్పుకొచ్చారు. ఆఖరి బాల్ ఉందంటూ ఏపీ ప్రజలకు ఎప్పటికప్పుడు చెబుతూ వచ్చారు. అయితే రాష్ట్ర విభజన జరగడంతో ఆయన సొంత పార్టీ పెట్టుకున్నారు. సమైక్యాంధ్ర పార్టీ పేరుతో అభ్యర్థులను బరిలోకి దింపినా ఆయన మాత్రం పోటీకి దూరంగా ఉన్నారు. పీలేరులో తప్పించి ఎక్కడా ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్ కూడా దక్కలేదు.
పదేళ్ల పాటు...
తర్వాత కొంతకాలం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయన సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాత్రం 2018 ప్రాంతంలో టీడీపీలో చేరారు. అయితే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఏపీకి కూడా పెద్దగా రాలేదు. పూర్తిగా హైదరాబాద్ కు మాత్రమే పరిమితమయ్యారు. తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినా అక్కడ కూడా యాక్టివ్ గా లేరు. ఏదో ఉన్నామంటే ఉన్నారని పించారు. కానీ ఉన్నట్లుండి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ ఇక దేశంలో అధికారంలోకి రాలేదని భావించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీలో చేరిన తర్వాత అప్పుడప్పుడు కొద్దిగా కనిపిస్తూ తాను యాక్టివ్ గానే ఉన్నారని అనిపించుకుంటున్నారు.
కేంద్ర మంత్రివర్గంలో...
2009లో పోటీ చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు మరోసారి ప్రత్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. అయితే ఇందులో నల్లారికి రెండు ప్రయోజనాలున్నాయి. ఒకటి దాదాపు దశాబ్దకాలంగా పదవులకు దూరంగా ఉన్నారు. మరోసారి రాజకీయంగా యాక్టివ్ కావాలని నిర్ణయించుకున్నారు. బీజేపీ ఎటూ అధికారంలోకి రావడం గ్యారంటీ అని భావిస్తున్న తరుణంలో తాను రాజంపేట నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయితే మాజీ ముఖ్యమంత్రిగా తనకు ప్రాధాన్యత ఉంటుందని, కేంద్ర మంత్రి పదవి లభిస్తుందన్న ఆలోచనలో ఆయన ఉన్నారు. అందుకే ఆయన ఈసారి పోటీకి సిద్ధమయినట్లు తెలిసింది.
చిరకాల ప్రత్యర్థిని...
ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కూడా ఉండటంతో గెలుపు కూడా పెద్ద కష్టం కాదని అంచనా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వేసుకుంటున్నారు. తన గెలుపు, కేంద్ర మంత్రి పదవిని కాసేపు పక్కన పెట్టినా, తన చిరకాల ప్రత్యర్థిపై పగ తీర్చుకునేందుకు ఇదే మంచి సమయమని ఆయన భావిస్తున్నట్లు తెలియవచ్చింది. రాజంపేట పార్లమెంటు నుంచి తన ప్రత్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిధున్ రెడ్డిని ఓడించే ఛాన్స్ తనకే దక్కుతుందన్న ఆశతోనూ ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం నుంచి 2014, 2019 ఎన్నికల్లో మిధున్ రెడ్డి విజయం సాధించారు. ఈసారి అతనిని ఓడించి తన చిరకాల ప్రత్యర్థిని దెబ్బకొట్టాలన్న కసితో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే రాజంపేట నుంచి ఆయన పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.
Next Story