Fri Nov 22 2024 15:32:54 GMT+0000 (Coordinated Universal Time)
బాలినేనిలో ఆ ఫ్రస్టేషన్ ...మంత్రి పదవి నుంచి తొలగించిన తర్వాత
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని మంత్రి పదవి నుంచి తొలగించిన తర్వాత పార్టీకి తలనొప్పిగా తయారయ్యారు
మంత్రి పదవిలో ఉంటే ఆయన అంత కామ్ గా ఎవరూ ఉండరు. కానీ మంత్రి పదవి తొలగించిన తర్వాత మాత్రం ఆయనలో ఏదో మార్పు కనిపిస్తుంది. సొంత పార్టీకే కొన్ని సార్లు తలనొప్పిగా మారుతున్నారు. అలా అని పార్టీ నుంచి పక్కకు వెళతారని కాదు. పార్టీలోనే ఉంటూ ఏదో ఒక వివాదాన్ని సృష్టించడం బాలినేనికి అలవాటుగా మారింది. ఒక్కోసారి జనసేనను పొడుగుతారు. టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలోనూ పాజిటివ్ గా మాట్లాడతారు. మళ్లీ సర్దుకుని అదేమీ లేదంటారు. ఎందుకో కాని బాలినేని ఈసారి మాత్రం కొంత బెరుకు గానే కనిపిస్తున్నట్లు అనిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకోవడమే కారణమంటున్నారు.
ఐదుసార్లు గెలిచి...
ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఐదు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈసారి టిక్కెట్ వస్తుందో రాదో అన్న అనుమానం కూడా ఆయనలో ఉందంటున్నారు. కారణం టీడీపీ, జనసేన పొత్తుతో ఆ పార్టీ ఒంగోలు నియోజకవర్గంలో బలంగా ఉంది. ఒంగోలు పట్టణంలో కాపు సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉంటారు. అదే సమయంలో రూరల్ ఏరియాలో కమ్మ సామాజికవర్గం కూడా అధికంగానే ఉంది. ఇద్దరూ కలిస్తే తనకు గెలుపు కష్టమని భావించి ఆయన ఫ్రస్టేషన్ కు లోనవుతున్నారని ఆయన సన్నిహితులే చెబుతున్నారు. ఎప్పుడూ లేని తరహాలో ఆయన అధికారులపై కాలుదువ్వుతున్నారు.
గన్మెన్లను సరెండర్...
తాజాగా పోలీసుల తీరుపై కూడా బాలినేని అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా ఏకంగా తన గన్మెన్లను తక్షణం సరెండర్ చేస్తున్నట్లు డీజీపీకి లేఖ రాయడం పార్టీలో సంచలనంగా మారింది. ఇదేమీ పెద్ద అంశమేమీ కాదు. నకిలీ భూ కుంభకోణం కేసులో పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే దీనిపై టీడీపీ నేతలు బాలినేనిపై ఆరోపణలు ఎక్కుపెట్టారు. కేసులో ఉన్న వారు ఎంతటి వారినైనా అరెస్ట్ చేయాలని బాలినేని పోలీసులకు సూచించినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మూడు రోజుల క్రితం కలెక్టర్ సమక్షంలో జరిగిన సమావేశంలోనే ఈ విషయాన్ని బాలినేని స్పష్టం చేశారు.
వీధిన పడ్డ వైసీపీ...
కానీ పోలీసులు మాత్రం కొందరినే అరెస్ట్ చేశారంటున్నారు. పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ ఆయన తన గన్మెన్లను సరెండర్ చేస్తున్నట్లు ప్రకటించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి మామూలు నేత అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు. స్వయానా ముఖ్యమంత్రి జగన్ కు దగ్గర బంధువు. అలాంటి బాలినేని ప్రభుత్వ అధికారులపై మండిపడట మంటే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమేనని అంటున్నారు. ఒక్క మాట ఉన్నతాధికారులతో చెప్తే పూర్తయ్యే పనికి ఆయన అనవసర రాద్ధాంతం చేస్తూ పార్టీని వీధిన పడేస్తున్నారన్న కామెంట్స్ సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం కేవలం వచ్చే ఎన్నికల్లో తన గెలుపుపై కలుగుతున్న అనుమానమేనన్న వారు లేకపోలేదు.
Next Story