Thu Dec 19 2024 12:32:40 GMT+0000 (Coordinated Universal Time)
Somireddy : "సర్వే" పల్లి అలా చెప్పిందా? సోమిరెడ్డికి సీటు అలా వచ్చేసిందట
తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మూడో జాబితాలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు కనిపించింది.
తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మూడో జాబితాలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు కనిపించింది. అయితే మొన్నటి వరకూ ఆయనకు టిక్కెట్ ఉండదని అందరూ అనుకున్నారు. చివరకు మూడో జాబితాలో సర్వే పల్లి నియోజకవర్గం నుంచి ఆయన పేరును ప్రకటించడంతో సోమిరెడ్డి శిబిరం ఒకింత శాంతించింది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి టిక్కెట్ దక్కడంతో ఈసారైనా గెలుపు గుర్రం ఎక్కుతారా? సింపతీ పనిచేస్తుందా? ఆయనకు ఈసారి విజయం తప్పదంటూ టీడీపీ శ్రేణులు పెద్దయెత్తున సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతున్నాయి. సోమిరెడ్డి విక్టరీ ఖాయమంటూ కామెంట్స్ పెడుతున్నారు.
నమ్మకమైన నేత...
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీనియర్ నేత. టీడీపీలో నమ్మకమైన లీడర్. పార్టీనే అంటిపెట్టుకుని ఉండటం ఆయనకు మరో క్వాలిఫికేషన్. అయితే సోమిరెడ్డి గత నాలుగు దఫాల నుంచి ఆయన సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఓటమి పాలవుతూనే వస్తున్నారు. 2004, 2009 లో కాంగ్రెస్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చేతిలోనూ, 2014, 2019 లో వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్థన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అంటే ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి రెండు దశాబ్దాలవుతుంది. అయితే 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో చంద్రబాబు సోమిరెడ్డిని ఎమ్మెల్సీని చేసి మరి తన మంత్రివర్గంలో స్థానం కల్పించారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యవసాయశాఖను అప్పగించారు.
లోకేష్ ప్రకటనతో...
కానీ మహానాడు లో లోకేష్ ప్రకటనతో సోమిరెడ్డికి టిక్కెట్ రాదని అందరూ భావించారు. వరసగా మూడు సార్లు ఓటమి పాలయిన నేతలకు సీటు ఇవ్వమని చెప్పారు. రూల్ ఫర్ ఆల్ అంటూ చినబాబు అనడంతో సోమిరెడ్డి టిక్కెట్ అనుమానంలో పడింది. ఆయన కుటుంబంలో ఒకరికి టిక్కెట్ ఇస్తారని అనుకున్నారు. ఆయన కుమారుడికిగాని లేదా కోడలికి గాని ఇవ్వాలనుకున్నారు. కానీ చివరి నిమిషంలో చంద్రబాబు మనసు మార్చుకున్నారు. ఐవీఆర్ఎస్ సర్వేలోనూ సోమిరెడ్డి పేరు ఎక్కువగా వినిపించడంతో ఆయన పేరే ఖరారయింది. మూడో జాబితాలో ఆయన పేరు కనిపించడంతో ఆయన వర్గంలో జోష్ పెరిగింది.
ప్రజల్లోనే ఉన్నా...
నిజానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆషామాషీ నేత కాదు. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్ననేత. నిత్యం జనంలోనే ఉంటారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పడు కూడా అధికారపార్టీపై విమర్శలకు చేయడానికి వెనుకాడరు. అలాంటి సోమిరెడ్డిని సర్వేపల్లి ప్రజలు మాత్రం నాలుగు ఎన్నికల నుంచి కాదనుకుంటున్నారు. ఈసారి అయినా తనను ఆదరిస్తారన్న విశ్వాసంతో సోమిరెడ్డి ఉన్నారు. కానీ ప్రత్యర్థి బలమైన నేత. వైసీపీ ఓటు బ్యాంకు కూడా అక్కడ బలంగా ఉంది. ఈపరిస్థితుల్లో ఐదోసారి ఎన్నికల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలుస్తారా? లేక ఎప్పటిలాగానే ఓటమి బాట పడతారా? అన్నది మాత్ర ఆసక్తికరంగానే ఉంది.
Next Story