Sun Dec 22 2024 21:39:51 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చి... తర్వాత సీఎం ఛాన్స్ కొట్టేసి
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి నాలుగేళ్లు కాలేదు. వెంటనే పీసీసీ చీఫ్ అయ్యారు. ముఖ్యమంత్రి కాబోతున్నారు.
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి నాలుగేళ్లు కాలేదు. వెంటనే పీసీసీ చీఫ్ బాధ్యతలను చేపట్టారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్నారు. ఇంత తక్కువ సమయంలో కాంగ్రెస్లో చేరి అత్యున్నత పదవులను చేపట్టిన వారిలో రేవంత్ రెడ్డి ఒక్కరేనని చెప్పనక్కర లేదు. ఇది సీనియర్లకు నచ్చకపోయినా ఇది మాత్రం పచ్చి నిజం. ఎవరూ అవునన్నా కాదన్నా.. ఒప్పుకుని తీరాల్సిందే. టాలెంట్ తో పాటు లీడర్ కు కావాల్సిన అన్ని లక్షణాలు పుష్కలంగా ఉండటంతో ఆయనకు అది సాధ్యమయింది.
ప్రస్థానం ఇలా...
రేవంత్ రెడ్డి 1969 నవంబరు 8న నాగర్కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామంలో జన్మించారు.2006లో మిడ్జిల్ మండలం జడ్పీటీసి సభ్యుడుగా విజయం సాధించారు. 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా ఎన్నికయ్యారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014–17 మధ్య తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. 2017 అక్టోబరులో టిడిపికి రాజీనామా చేసి 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని చేపట్టారు. 2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2019 మేలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించారు. 2021లో జూన్ 26న పీసీసీ అధ్యక్ష్యుడిగా రేవంత్ నియమితులయ్యారు. 2021 జూలై 7న టీపీసీపీ అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టారు. ఈ నెల 7 న తెలంగాణ రాష్ట్ర 2 వ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
తన ప్రయాణాన్ని...
ఇలా రేవంత్ తన రూట్ ను పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. ఎప్పుడు ఎలా పార్టీ మారాలో ఆయన నిర్ణయించుకున్న ప్రకారమే సక్సెస్ అవుతూ వచ్చారు. ఏ పార్టీలో ఉన్నప్పటికీ లైమ్ లైట్ లో ఉండటం రేవంత్ ప్రత్యేకత. పార్టీ అధినాయకత్వంతో దగ్గరగా మసలు కోవడంతో పాటు వారి మన్ననలను పొందడం రేవంత్ స్పెషాలిటీ. యాభై నాలుగేళ్ల వయసులో రేవంత్ తెలంగాణకు మూడో ముఖ్యమంత్రి కాబోతున్నారు. అది అందరికీ సాధ్యం కాదు. ఒక్క తనకే సాధ్యమవుతుందని నిరూపించుకోగలిగారు. అందుకే రేవంత్ అనేక మంది యువతకు రాజకీయాల్లో ఎలా రాణించాలన్నది దారి చూపించగలిగారు. అయితే ఈ మార్గంలో కొన్ని హర్డిల్స్ ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగారు. అందుకే సామాన్య వ్యక్తి నుంచి లీడర్ గా మారి నేడు రూలర్ గా మారుతున్నారు. ఆల్ ది బెస్ట్ రేవంత్.
Next Story