Tue Dec 24 2024 02:18:21 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : నాలుగోది కూడా వచ్చేసింది డ్యూడ్.. మరెన్ని లిస్టులుంటాయో?
వైసీపీ నాలుగో జాబితా విడుదలయింది. మొత్తం 9 నియోజకవర్గాల్లో మార్పులు చేపట్టారు.
వైసీపీ నాలుగో జాబితా విడుదలయింది. మొత్తం 9 నియోజకవర్గాల్లో మార్పులు చేపట్టారు. ఒక పార్లమెంటు, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో మార్పులు చేశారు. ఇప్పటి వరకూ మూడు జాబితాలను ప్రకటించిన పార్టీ హైకమాండ్ 59 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేపట్టింది. గెలుపు ఆధారంగానే ముఖ్యమంత్రి జగన్ సర్వేల నివేదికల ప్రకారం ఇన్ఛార్జులను నియమిస్తున్నారు. మంత్రులతో పాటు అనేక మంది సీనియర్ నేతలకు కూడా స్థాన చలనం తప్పడం లేదు. కొందరికి మాత్రం టిక్కెట్లు లేవని చెప్పేస్తున్నారు. అయితే జగన్ మాత్రం టిక్కెట్ దక్కకపోయినా తన మనిషివేనని, అధికారంలోకి రాగానే మరో కీలక పదవి ఇస్తామని చెబుతున్నారు.
హామీలు వస్తున్నా...
ఇప్పటికే కొందరికి రాజ్యసభ పదవులు, మరికొందరికి ఎమ్మెల్సీ పదవులు ఆఫర్ ఇచ్చారు. చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులును రాజ్యసభకు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు ఎమ్మెల్సీ పదవి హామీ లభించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే తమ నియోజకవర్గాలను కోల్పోవడంతో ఒకింత అసంతృప్తికి, అసహనానికి గురైన ఎమ్మెల్యేలు కొందరు సర్దుకుని పోతుండగా, మరికొందరు మాత్రం పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. అనుకున్న స్థాయిలో అసంతృప్తి ఉందని చెప్పలేం. అలాగని లేదని అనలేం. నియోజకవర్గాలను కోల్పోయిన మంత్రులు, ఎమ్మెల్యేలు కొత్త ఇన్ఛార్జుల పరిచయ కార్యక్రమంలో కన్నీటి పర్యంతమవుతున్నారు.
కన్నీళ్లతో వీడ్కోలు చెబుతూ...
తాము నాలుగున్నరేళ్లు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాన్ని వదలలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొత్త వారికి ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నారు. న్యూ ఫేసెస్ అయితే ప్రజలు కూడా కనెక్ట్ అవుతారని, ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకత వీరిపై పడదన్న అంచనాతో జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఎవరికీ మినహాయింపు ఇవ్వడం లేదు. బంధువులు, సీనియర్లు.. అని చూసీ చూడనట్లు పోవడం లేదు. గెలుపు కష్టమని ఏ మాత్రం ఉప్పందినా నిర్దాక్షిణ్యంగా జగన్ పక్కన పెట్టేస్తున్నారు. ఇది కొంత పార్టీలో కలకలం రేపుతున్నప్పటికీ అంతా మన మంచికేనంటూ జగన్ ముందుకెళుతున్నారు. తాజా జాబితాలో కూడా కొన్ని మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి.
నాలుగో జాబితాలో వీరే
01. చిత్తూరు పార్లమెంటు - నారాయణస్వామి
02. జీడీ నెల్లూరు - రెడ్డప్ప
03. శింగనమల - ఎం. వీరాంజనేయులు
04. తిరువూరు - నల్లగట్ల స్వామిదాస్
05. కొవ్వూరు - తలారి వెంకట్రావు
06. కనిగిరి - దద్దాళ్ల నారాయణ యాదవ్
07. గోపాలపురం - తానేటి వనిత
08. నందికొట్కూరు - డాక్టర్ దారా సుదీర్
09. మడకశిర - ఈర లక్కప్ప
Next Story