Sun Nov 17 2024 20:37:58 GMT+0000 (Coordinated Universal Time)
BJP : కండువా కప్పుకున్న రోజే టిక్కెట్...ఏం మాయ చేశావు అంకుల్?
తిరుపతి లోక్సభ స్థానాన్ని పార్టీలు మారి వచ్చిన వారికి టిక్కెట్ ఇవ్వడం ఇప్పుడు బీజేపీలో చర్చనీయాంశంగా మారింది
తిరుపతి లోక్సభ స్థానాన్ని పార్టీలు మారి వచ్చిన వారికి టిక్కెట్ ఇవ్వడం ఇప్పుడు బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. మూడు పార్టీలు మారి బీజేపీలో చేరి టిక్కెట్ ను తెచ్చుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు ఏ మేరకు సహకరిస్తాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. తిరుపతి పార్లమెంటు సీటు మాజీ ఐఏఎస్ అధికారి వరప్రసాదరావుకు బీజేపీ సీటు కేటాయించింది. అయితే ఆయనకు ఏ విధంగా టిక్కెట్ ఇస్తారని పలువురు బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. నరసాపురంలో గెలిచే రఘురామ కృష్ణరాజుకు కాదని పార్టీ నేతకు టిక్కెట్ ఇచ్చినప్పుడు తిరుపతిలోనూ అదే ఫార్ములా ఎందుకు పనిచేయదని కమలం పార్టీలో కొందరు నిలదీస్తున్నారు.
ట్రాక్ రికార్డు మాత్రం...
తిరుపతి పార్లమెంటు స్థానం ఎప్పుడూ కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీలదే. చివరిసారి 1999లో తిరుపతి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన వెంకటస్వామి గెలుపొందారు. అదే ఆఖరు. ఆ తర్వాత జరిగిన 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ , వైసీపీలు మాత్రమే గెలిచాయి. 1984లో మాత్రం టీడీపీ విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో చింతామోహన్ టీడీపీ నుంచి గెలిచారు. టీడీపీకి ఆ తర్వాత తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో గెలుపు పిలుపు వినిపించలేదు. ఇప్పటి వరకూ అక్కడ టీడీపీ జెండా ఎగరలేదు. దానికి అనేక కారణాలున్నాయి. తిరుపత నియోజకవర్గం పరిధిలో ఉన్న చంద్రగిరి, గూడూరు, తిరుపతి, వెంకటగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేటలు ఉన్నాయి. వీటిలో టీడీపీ బలహీనంగా ఉండటమే కారణమన్న విశ్లేషణలు ఉన్నాయి.
జెండా కప్పుకున్న రోజే...
ఇక తాజాగా తిరుపతి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన వరప్రసాదరావు గత ఆదివారం బీజేపీ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన రోజే ఆయనకు సీటు దక్కింది. వరప్రసాదరావు తమిళనాడుకు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి. ఆయన తొలుత ప్రజారాజ్యం పార్టీలో చేరి తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఆ తర్వాత ఆయన 2014 ఎన్నికల్లో ఆయన వైసీపీలో చేరి తిరుపతి పార్లమెంటు సీటు తెచ్చుకున్నారు. ఆ ఎన్నికల్లో పార్లమెంటు సభ్యుడిగా గెలిచారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఆయనను వైసీపీ అధినేత జగన్ గూడూరు శాసనసభ స్థానం నుంచి పోటీ చేయించారు. అక్కడా గెలిచారు. వరసగా రెండు దఫాలు చట్టసభల్లో ఆయన కాలుమోపారు. కానీ 2024 ఎన్నికల్లో ఆయనకు వైసీపీ అధినాయకత్వం టిక్కెట్ ఇవ్వలేదు.
పార్టీలు మారుతూ...
దీంతో వరప్రసాదరావు జనసేన జెండాను కప్పుకున్నారు. అయితే అక్కడా ఆయనకు సీటు దక్కదని తెలిసి తెలివిగా బీజేపీలో చేరిపోయారు. వెంటనే టిక్కెట్ ఆయనకే కన్ఫర్మ్ అయింది. ఇలా పార్టీ మారడం టిక్కెట్ తెచ్చుకోవడం ఆయనకు మాత్రమే చెల్లింది. మాజీ ఐఏఎస్ అధికారి కావడం, భాష సమస్య లేకపోవడంతో పాటు సామాజికవర్గంలో కొంత సానుకూలత ఉండటం కూడా వరప్రసాదరావుకు వరసగా టిక్కెట్లు దక్కుతూ వస్తున్నాయి. ఈసారి కూడా అంతే.చేరిన రోజే టిక్కెట్ రావడం అంటే.. అందులోనూ బీజేపీలో అది అసాధ్యమనుకుంటే పొరపాటే. ఎందుకంటే మన వరప్రసాద్ ఉన్నారు కదా మరి... ఆయనను పార్టీ మారే నేతలు ఆదర్శంగా తీసుకుంటే మాత్రం? మరి వరప్రసాదరావు ఈ ఎన్నికల్లో గెలిస్తే మాత్రం వరసగా మూడు దఫాలుగా ఏదో ఒక సభలో ప్రాతినిధ్యం వహించినట్లే అవుతుంది.
Next Story