Mon Dec 23 2024 01:34:13 GMT+0000 (Coordinated Universal Time)
అలా అనుకుంటే మీరే బోర్లా పడతారు : గుత్తా సుఖేందర్ రెడ్డి
పార్టీ అవకాశం ఇస్తేనే తాము పోటీ చేస్తామని, టికెట్ల కోసం పైరవీలు చేసి, ప్రాకులాడటం వంటివి చేయమన్నారు. రాజకీయాలన్నాక..
తెలంగాణ మంత్రి జగధీష్ రెడ్డికి తనకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. నల్గొండ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నల్గొండ జిల్లా అధికారిక వ్యవహారాల్లో తానెప్పుడూ జోక్యం చేసుకోనని తెలిపారు. ఒకవేళ ఎవరైనా తన వద్దకు వచ్చినా.. నిబంధనల ప్రకారం వెళ్లాలని చెబుతానన్నారు. అధికారికంగా, రాజకీయంగా జిల్లాలో ఏం జరిగినా అది సీఎం కేసీఆర్ దృష్టిలో ఉంటుందన్నారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ కొడుకు అమిత్ కు ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ విషయమై ప్రశ్నించగా.. అది పూర్తిగా పార్టీ నిర్ణయానికే వదిలేస్తున్నట్లు తెలిపారు.
పార్టీ అవకాశం ఇస్తేనే తాము పోటీ చేస్తామని, టికెట్ల కోసం పైరవీలు చేసి, ప్రాకులాడటం వంటివి చేయమన్నారు. రాజకీయాలన్నాక గెలుపు ఓటములు సహజమని గుత్తా హితవు పలికారు. మరోవైపు కోమటిరెడ్డి వ్యవహారం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటి అడ్డూ, అదుపు లేకుండా.. కనీస విజ్ఞత లేకుండా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇష్టానికి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎంత విమర్శలు చేసినా.. భాష విషయంలో మాత్రం తాను చాలా హుందాగా ఉంటానని పేర్కొన్నారు. బురదలో రాయివేసే అలవాటు తనకు లేదన్నగుత్తా సుఖేందర్ రెడ్డి.. సొంత పార్టీలో వారే అవిశ్వాసాలు చూపడం మంచి సంప్రదాయం కాదని తెలిపారు. అలాగే వామపక్షాలతో బీఆర్ఎస్ సీట్ల పొత్తు ఖరారు అయ్యాకే ఉమ్మడి నల్గొండ జిల్లాలో అభ్యర్థుల మార్పుపై క్లారిటీ వస్తుందని తెలిపారు. ఎక్కడ పనిచేసినా, ఏ పార్టీలో ఉన్నా రాజకీయ నాయకులకు, ప్రజా ప్రతినిధులకు ఆత్మవిమర్శ అనేది ఉండాలని.. అది వదిలేసి అంతా నాకే తెలుసు.. నాకెవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటే బొక్క బోర్లా పడటం ఖాయమన్నారు. ప్రతి ప్రజానిధి తాము చేసే పనులను జనం మెచ్చుకుంటున్నారో లేదో ఆలోచించాలని సూచించారు.
Next Story