ఏపీలో బీఆర్ఎస్ ఆపరేషన్ ఆగిందా?
ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ హడావుడి తగ్గిందా? రాష్ట్రంలో రాజకీయాలను పూర్తిగా వదిలేసిందా? రాష్ట్రంలో పార్టీ విస్తరణ ఆపరేషన్
ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ హడావుడి తగ్గిందా? రాష్ట్రంలో రాజకీయాలను పూర్తిగా వదిలేసిందా? రాష్ట్రంలో పార్టీ విస్తరణ ఆపరేషన్ ఆగిందా? అంటే అవుననే సమాధానమే రాష్ట్ర రాజకీయ వర్గాల నుండి వినిపిస్తోంది. అప్పట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన హడావుడి అంత ఇంత కాదు. ఏకంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను కొనకున్నా.. కొన్నంతా పని చేశారు. అయితే ఇప్పుడు భారత రాష్ట్ర సమితి పేరుతో కేసీఆర్ చేసిన హడావుడి కాస్తా నెమ్మదించినట్లు కనిపిస్తోంది. మహారాష్ట్రలో పార్టీ విస్తరణపై ఏదో మొక్కుబడి పనులు చేస్తున్నా, ఏపీలో మాత్రం రాజకీయాలను పూర్తిగా వదిలేశారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఏపీలో పార్టీ అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం రాష్ట్ర నాయకుల్లో సన్నగిల్లుతోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
మహారాష్ట్రలో సీఎం కేసీఆర్ ఇప్పటికే మూడు సభలు నిర్వహించారు. అక్కడి నుంచి ప్రతి రోజూ కొంతమందిని హైదరాబాద్‌కు తీసుకువచ్చి పార్టీ కండువా కప్పుతూ ఫొటోలకు పోజులిస్తున్నారు. అంతకుముందు పలువురు ఆంధ్రప్రదేశ్ నేతలను చేర్చుకుని, అక్కడ పార్టీని భారీగా విస్తరిస్తామని ప్రకటించారు. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షునిగా తోట చంద్రశేఖర్‌ను నియమించారు. విశాఖపట్నంలో సభ నిర్వహిస్తామన్న బీఆర్ఎస్.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులు కూడా.. పార్టీ విస్తరణ కోసం పని చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఏపీలో బీఆర్ఎస్ రాష్ట్ర శాఖ కార్యాలయాన్ని తోట చంద్రశేఖర్ ప్రారంభించిన సమయంలో ఆ పార్టీ చీఫ్ కేసీఆర్, తెలంగాణకు చెందిన నేతలు ఎవరూ కూడా హాజరు కాలేదు.
ఏపీలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పార్టీ అగ్రనాయకులు ఎవరూ హాజరుకాకపోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అటు తెలంగాణలోని పలు జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ కొత్త ఆఫీసులను సీఎం కేసీఆరే స్వయంగా ప్రారంభించారు. ఆ సందర్భంగా బహిరంగ సభలను ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాలపై సెన్సెషనల్ వ్యాఖ్యలు చేశారు. భాష రాని మహారాష్ట్రకు వెళ్లి వరుస సభలు పెడుతున్న కేసీఆర్.. పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఏపీలో బీఆర్ఎస్ నాయకులు స్తబ్దుగా ఉండటం వెనక అసలు మతలబు ఏంటనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏపీ ప్రజల పట్ల కేసీఆర్ చేసిన కామెంట్స్ గుర్తుకు వచ్చి వెనక్కి తగ్గుతున్నారని కొందరంటున్నారు.