Mon Dec 23 2024 07:57:04 GMT+0000 (Coordinated Universal Time)
Congress : ఇక మిగిలింది డెబ్బయి రోజులే.. ఇటు చూస్తే అప్పులు.. అటు చూస్తే గ్యారంటీలు
కాంగ్రెస్ ప్రభుత్వానికి తలనొప్పులు తప్పేట్లు లేవు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలులో ఇబ్బందులు తప్పేట్లు లేవు
తెలంగాణ కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తలనొప్పులు తప్పేట్లు లేవు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంతో పాటు మ్యానిఫేస్టోలో పొందు పర్చాల్సిన అంశాలను అమలు చేయాలంటే కోట్ల రూపాయల నిధులు కావాలి. కానీ ఖజానా చూస్తే ఖాళీగా వెక్కిరిస్తుంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని, మ్యానిఫేస్టోలో పొందుపర్చిన అంశాలను కూడా గ్రౌండ్ చేస్తామని కాంగ్రెస్ ప్రజలకు మాట ఇచ్చింది. ఈ నెల 7వ తేదీన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే నేటికి సరిగ్గా ప్రభుత్వం ఏర్పడి ఇరవై రోజులు మాత్రమే అయింది.
డెబ్బయి రోజులు మాత్రమే...
మరో డెబ్బయి రోజులు మాత్రమే ఆరు గ్యారంటీలను అమలు చేయడానికి సమయం ఉంది. అయితే డిసెంబరు 9వ తేదీన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో పాటు ఆరోగ్య శ్రీ పరిమితిని పది లక్షలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరో ముఖ్యమైన నాలుగు గ్యారంటీలు మిగిలిపోయాయి. వాటిని అమలు చేసేందుకు రేపటి నుంచి జనవరి ఆరో తేదీ వరకూ ప్రజా పాలన పేరిగ గ్రామ సభలను నిర్వహిస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్. కానీ నాలుగు గ్యారంటీలతో పాటు హామీల అమలుకు కోట్లాది రూపాయలు ఖర్చు కానున్నాయి. ఉదాహరణకు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ఆరు గ్యారంటీలను...
రెండు లక్షల రూపాయలను ఒకేసారి మాఫీ చేస్తామని ప్రకటించడంతో ఇప్పుడు ఖజానాపై భారం పడనుంది. దీంతో పాటు రైతు బంధు పథకాన్ని కూడా అమలు చేయాల్సి ఉంది. మహిళలకు నెలకు 2,500 రూపాయలు, ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ను ఇస్తామని కూడా కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. రైతు భరోసా కింద రైతులకు ఏడాదికి పదిహేను వేలు, కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇస్తామని తెలిపారు. దీంతో పాటు ఇల్లు లేని వారికి సొంత స్థలంలో ఇంటిని నిర్మించుకునేందుకు ఐదు లక్షల సాయాన్ని ఇస్తామని ప్రకటించారు. చేయూత కింద నెలకు నాలుగు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఐదు లక్షల మేరకు విద్యా భరోసా కార్డును అందచేస్తామని కూడా తెలిపారు. అభయ హస్తం పేరిట మ్యానిఫేస్టోను కూడా ప్రకటించారు.
నిధులు ఎక్కడ?
ఇవన్నీ అమలు చేయాలంటే ఇప్పుడు ఖజానాలో ఉన్న సొమ్ము సరిపోదు. ఉద్యోగుల జీతభత్యాలు పోను మిగిలేది అరకొరే. అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్రం వైపు చూస్తుంది. నిన్న వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలసి తమకు రావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరి వచ్చారు. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత వరకూ సాయం అందుతుందన్నది మాత్రం ఇంకా తెలియ రాలేదు. దీంతో గత ప్రభుత్వం మాదిరిగానే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వందరోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే అభాసుపాలు అవుతామని, అందులోనూ లోక్సభ ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ కు అమలు చేయాల్సిన ఖచ్చితమైన పరిస్థితి ఏర్పడింది. మరి రేవంత్ సర్కార్ ఈ గండం నుంచి ఎలా బయటపడుతుందన్నది వేచి చూడాల్సి ఉంది.
Next Story