అక్కడి నుంచే నా పోటీ: మంత్రి వేణుగోపాలకృష్ణ
ఏపీలోని రామచంద్రపురం నియోజకవర్గంలో రాజకీయం ఆసక్తిని రేపుతోంది. గత కొన్ని రోజులుగా ఈ నియోజకవర్గంలో అసమ్మతి ఉందంటూ వార్తలు
ఏపీలోని రామచంద్రపురం నియోజకవర్గంలో రాజకీయం ఆసక్తిని రేపుతోంది. గత కొన్ని రోజులుగా ఈ నియోజకవర్గంలో అసమ్మతి ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ వార్తలపై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పందించారు. రామచంద్రాపురం నియోజకవర్గంలో ఎలాంటి అసమ్మతి లేదని తెలిపారు. ఏదైనా జరిగి ఉంటే.. ఈ పరిణామాలన్నీ కృష్ణార్పణం అనేదే తన సమాధానమని వెల్లడించారు. రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తనకు గురువు లాంటి వారని వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. తాను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రామచంద్రాపురం నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ కూడా చెప్పారని తెలిపారు.
ఇవాళ బీసీ గర్జన సభలో పాల్గొన్న మంత్రి వేణుగోపాలకృష్ణ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పేదరికమే బీసీలకు పెద్ద రోగమని అన్నారు. సుదీర్ఘ పేదరికం కారణంగా రెండు మూడు తరాలు కష్టాలు ఎదుర్కొన్నాయని అన్నారు. బీసీల పరిస్థితిపై సమగ్ర సర్వే కోసం మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో ఐఏఎస్ అధికారులతో కమిటీ వేయడం జరిగిందని తెలిపారు. బీసీలకు ఏం కావాలో గుర్తించి, ఆ దిశగా పథకాలు అందిస్తున్న ప్రభుత్వం తమదేనని మంత్రి తెలిపారు. ఇటీవల దివంగత సీఎం వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వచ్చే ఎన్నికల్లో ల్లి సుభాష్ చంద్రబోస్ రెండో కుమారుడు సూర్య ప్రకాష్ బరిలో ఉంటారని తన అనుచరులతో ప్రకటన చేయించారు.
అప్పటి నుంచి నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు మారుతూ వస్తున్నాయి. కొద్ది నెలల క్రితమే పార్టీ ఉభయ గోదావరి రీజినల్ కో-ఆర్డినేటర్ మిథున్‌రెడ్డి బీసీ సంక్షేమ శాఖామంత్రి వేణుగోపాలకృష్ణ రామచంద్రాపురంలో పోటీ చేస్తారని ప్రకటించారు. నాటి నుంచి ఇక్కడ వైసీపీ అభ్యర్థి వేణు అని కార్యకర్తలు మానసికంగా సిద్ధమవ్వగా, బోసు సరికొత్త ప్రకటన చేయించడంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆశ్చర్యంలో పడ్డారు. అయితే ఇప్పుడు వేణుగోపాల్.. రామచంద్రపురం నుంచే తన పోటీ ప్రకటన చేయడం ఆసక్తిగా మారింది. దీంతో దివంగత రాజశేఖర్‌రెడ్డికి ముఖ్య అనుచరుడిగా పేరుపొందిన మాజీ మంత్రి బోసు తన రాజకీయ అడుగులు ఎటు వేస్తారు? అనేది పెద్ద చర్చగా మారింది.